YSRCP Government Neglected Irrigation Canals in Kakinada District : కాకినాడ జిల్లాలోని గోదావరి డెల్టా శివారు మండలమైన తాళ్లరేవులో సాగు నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. మండలంలోని పి.మల్లవరం పరిధిలోని గ్రాంటు ఆయకట్టుకు సాగు నీరు అందటం లేదు. 20 రోజులుగా పంట కాల్వల నుంచి చుక్క నీరు సరఫరా కావడం లేదు. నీటి సరఫరా నిలిచిపోవడంతో నాట్లు వేసిన వరి పొలాలు బీటలు తీశాయి.
తూతూ మంత్రంగా పూడికతీత పనులు :గ్రాంటు, పటవల, చొల్లంగి గ్రామాల్లోని సుమారు 800 ఎకరాలపైగా వరి దుబ్బలు ఎదుగుదల కోల్పోయాయి. కొన్నేళ్లుగా సార్వా, దాళ్వాల్లో సాగు నీటి ఇబ్బందులు ఈ ఆయకట్టు పరిధిలో రైతుల్ని వేధిస్తోంది. తాజాగా రోజుల తరబడి నీరు అందక పోవడంతో వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన పంట ఎండిపోవడంతో కౌలు రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో అధికారులు వచ్చి పొలాల్ని పరిశీలించి వెళ్లడం తప్ప పంటకు పుష్కలంగా నీరు అందించలేదు. గ్రాంటు ఆయకట్టు పరిధిలో పంట కాల్వలు పూర్తిగా పూడికతో నిండి పోయాయి. పూడిక తీత పనులు శాశ్వతంగా చేపట్టలేదు. ఏటా తూతూ మంత్రంగా పూడిక తీయడంతో నీరు పొలాలకు చేరడం లేదు.