YOUTH FIRE ON YSRCP :ఉద్యోగం కోసం నువ్వెళ్లేది ఎక్కడికి? తెలంగాణా? కర్ణాటకా? తమిళనాడా? ఇది ఏపీలోని విద్యా సంస్థల్లో బీటెక్, డిగ్రీ చివరి ఏడాది చదివే విద్యార్థుల్లో ఏ ఇద్దరు కలిసినా ఎదురవుతున్న ప్రశ్న. సీఎం జగన్ హయాంలో ఏపీ దుస్థితికిది నిలువుటద్దం. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, పరిశ్రమలను తీసుకొచ్చి, యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తాయి. ఈ సర్కార్‌ది రివర్స్ పాలన కదా ! అందుకే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా చేసింది. శిక్షణ కేంద్రాలను మూలనపడేసి యువతకు నైపుణ్యాలు అందకుండా చూసింది. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా ఉన్న వాటినీ తరిమేసింది. యువతరం ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు పోవాల్సిన దుస్థితిని కల్పించింది. ఒకవేళ ఇక్కడే ఉండాలనుకుంటే మాల్స్‌లో, చిన్నచిన్న పరిశ్రమల్లో పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 30 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారని అంచనా.
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు, ఇతర యువతకు ఉపాధి అవకాశాలు లేకుండాపోయాయి. గత ఐదేళ్లలో విశాఖపట్నంలో సుమారు 100 అంకుర సంస్థలు మూతపడ్డాయి. ఐబీఎం, హెచ్‌ఎస్‌బీసీ వంటి సంస్థలు వెళ్లిపోయాయి. తెదేపా ప్రభుత్వం ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చేందుకు డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కు విధానాన్ని పాటించింది. దరఖాస్తు చేసుకున్న కంపెనీకి సగం అద్దెకే ఆఫీసు స్పేస్ ఇచ్చేవారు. ఇంటర్నెట్, విద్యుత్తు సదుపాయం కల్పించేవారు. అయా సంస్థలు కల్పించే ఉద్యోగాలను బట్టి వాటికి నగదు ప్రోత్సాహకాలు అందించేవారు. జగన్ అధికారంలోకి వచ్చాక వీటిని నిలిపివేశారు. ప్రోత్సాహకాలు లేక కొన్ని చిన్న సంస్థలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా మరికొన్ని మూతపడ్డాయి. రాష్ట్రంలో పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలు లేకపోవడంతో నియామకాలు చేపట్టే పరిస్థితి లేదు. ప్రతిభ ఉన్న యువతకు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు వచ్చినా ఇవి కూడా చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల్లోనే ఉంటున్నాయి.
నిరుద్యోగంలో నంబర్ వన్ :గ్రాడ్యుయేట్లలో 24 శాతం నిరుద్యోగ రేటుతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక బహిర్గతం చేసింది. జులై 2022 నుంచి జూన్ 2023 వరకు నిర్వహించిన సర్వే ప్రాతిపదికన దీన్ని రూపొందించారు. దీని ప్రకారం ఏపీలో జాతీయ సగటు కంటే పట్టభద్రుల్లో నిరుద్యోగిత అధికంగా ఉంది. చివరికి బిహార్ కూడా ఈ విషయంలో ఏపీ కంటే మెరుగ్గా ఉంది. అండర్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వారిలో నిరుద్యోగిత రేటు ఏపీలో 24 శాతం ఉంటే జాతీయ సరాసరి 13.4 శాతంగా ఉంది. పక్కనున్న తెలంగాణ 9, తమిళనాడు 10వ స్థానంలో నిలిచాయి. అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన మహిళలో 34.6 శాతం నిరుద్యోగిత ఉండగా పురుషుల్లో 20.3 శాతంగా ఉంది. అదే ఇంటర్మీడియట్ కంటేలోపు చదువుకున్న వారిలో నిరుద్యోగిత తక్కువగా ఉంది. షాపింగ్‌మాల్స్, వాచ్‌మెన్‌లాంటి ఉద్యోగాలే రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేందుకు ఇది ఒక నిదర్శనం.
ఏపీలోనే ఈ పతనం ఎక్కువ :యువత నైపుణ్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరవవడం ఇలా అన్ని అంశాల్లోనూ దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ఏపీనే అట్టడుగున నిలిచిందని భారత ఉపాధి నివేదిక-2024 బహిర్గతం చేసింది. దీని ప్రకారం రాబోయే 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో యువ జనాభా 5.6 శాతం తగ్గిపోనుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే ఈ పతనం ఎక్కువగా ఉంది. 2021 నుంచి 2036 నాటికి 15-29 ఏళ్ల మధ్య వయసున్న మన యువత 1.33 కోట్ల నుంచి 1.06 కోట్లకు తగ్గిపోనుండడం ఆందోళన కలిగించే అంశం.
రాష్ట్రంలో యువత వలసల రేటు 31.6 శాతం ఉండగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్న వారిలో 46.9 శాతం మంది పురుషులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)తో కలిసి మానవ వనరుల అభివృద్ధి సంస్థ రూపొందించిన ఈ నివేదిక తాజాగా విడుదలైంది. వలసల్లో జాతీయ సగటు (28.9%) కన్నా ఏపీలో 2.7% ఎక్కువ ఉండడం రాష్ట్ర దుస్థితికి అద్దం పడుతోంది. వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో ముందుండే బిహార్‌లోనూ వలసల రేటు 14.2% మాత్రమే. ఉత్తరప్రదేశ్(28.4%), రాజస్థాన్(28.5%), అస్సాం (23.7%)లలో కూడా ఏపీ స్థాయిలో వలసల్లేవు. 15-29 ఏళ్ల వయసున్న డిగ్రీలోపు చదివిన యువతకు ఉపాధి కల్పనలో దేశంలో ఏపీ 12వ స్థానంలో ఉంది.
జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించాడు - గద్దెనెక్కి నిరుద్యోగులను నిండా ముంచాడు - Youth Fire on YSRCP Govt
జాబ్ క్యాలెండర్ ఇవ్వనే లేదు :2019 ఎన్నికల ముందు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని, ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నిలువునా ముంచేశారు. ఐదేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా 2,210 పోస్టులకు ప్రకటన ఇవ్వగా వీటిలో కొన్ని మాత్రమే భర్తీచేశారు. ఉపాధ్యాయ ఖాళీలు 28 వేల వరకు ఉండగా 6,100 పోస్టులకు ఎన్నికల ముందు డీఎస్సీ ప్రకటన ఇచ్చారు. ఎన్నికల కోడ్‌తో ఇదీ వాయిదా పడింది.
ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీకీ దిక్కు లేకుండా పోయింది. 411 ఎస్సై పోస్టులను నింపి మమ అనిపించారు. విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చినా న్యాయ వివాదాలతో నిలిచిపోయింది. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించి, 10 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, దాన్ని అటకెక్కించారు. ఐదేళ్లలో ఈ కర్మాగారానికి రెండుసార్లు శంకుస్థాపన చేసిన ఘనత జగన్‌కే చెల్లింది.