YSRCP Corruption in Guntur Mirchi Yard : ఆసియాలోనే పెద్దదిగా పేరున్న గుంటూరు మిర్చియార్డులో ఏటా రూ. 12వేల కోట్ల లావాదేవీలు జరుగుతాయి. సగటున కోటీ 70 లక్షల నుంచి కోటీ 80 లక్షల మిర్చి బస్తాలు యార్డుకు వస్తుండగా లెక్కల్లో మాత్రం కోటీ 40 లక్షల నుంచి కోటీ 50 లక్షల బస్తాలు మాత్రమే చూపుతున్నారు. మిగిలిన 30లక్షల బస్తాలు యార్డు నుంచి బయటకు పంపుతున్నారు. మార్కెట్ సెస్, జీఎస్టీ ఎగవేసే విధానం పేరే 'జీరో'. ఇలా ఒక శాతం మార్కెట్ సెస్ చొప్పున ఏటా రూ.18 కోట్ల రాబడికి గండి కొడుతున్నారు. సరకు విలువలో 5 శాతం జీఎస్టీ చొప్పున 90 కోట్లు ఎగవేస్తున్నారు. మొత్తంగా ఏడాదికి రూ. 108 కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో రూ. 540 కోట్లు దారి మళ్లించారు. ఇలా సరకును బయటకు పంపినందుకు వేమెన్లకు 10, గేటు వద్ద 6 నుంచి 7, యార్డుకు 6 రూపాయలు కలిపి మొత్తంగా బస్తాకు 23 రూపాయలు వసూలు చేస్తున్నారు.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో యార్డు కార్యదర్శిగా ఉప సంచాలకుల హోదాలో 4 నెలలు పనిచేసిన ఓ అధికారి, లెక్కల్లో చూపకుండా 5 లక్షల బస్తాలు "జీరో" రూపంలో యార్డు దాటించి కోట్లలో దండుకున్నారు. గతంలోనూ అయన అనుచరులైన అధికారులతో 5 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. దీనిపై విచారణ జరిగినా, తూతూమంత్రం నివేదికతో సదరు అధికారి, సిబ్బంది చర్యల నుంచి తప్పించుకోగలిగారు. మిర్చి ధర తగ్గించి చూపడం ద్వారా సెస్, GSTలను ఎగవేసేందుకు అధికారులు సహకరిస్తున్నారు.
'క్వింటాకు రూ. 20 వేల చొప్పున కొనుగోలు చేస్తే బిల్లుల్లో మాత్రం 10వేల చొప్పున కొన్నట్లుగా చూపిస్తారు. దీని పేరే కటింగ్ ఇలా ఏడాదికి క్వింటాకు రూ.10 వేల చొప్పున ఐదేళ్లలో రూ. 50 కోట్లకు పైగా గండికొట్టారు. సహకరించిన యార్డు యంత్రాంగానికి బస్తాకు 4, వేమెన్లకు 6 రూపాయల చొప్పున వ్యాపారులు ముట్టజెప్తున్నారు. ఒకరి పేరుతో లైసెన్సు ఉంటే దానిపై మరొకరు లావాదేవీలు చేయడమే 'బిల్ టు బిల్' అందులోనూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు.'-మన్నవ సుబ్బారావు, మిర్చియార్డు మాజీ ఛైర్మన్