YS JAGAN MOHAN REDDY ADANI RELATION: జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అదానీప్రదేశ్‌గా మార్చేసింది. భారీ పోర్టుల నుంచి స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టు వరకు ప్రతీదీ అదానీకే కట్టబెట్టారు. ఐదేళ్లలో పోర్టులు, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, ఇళ్లకు స్మార్ట్ మీటర్లు చివరకు థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా టెండర్లనూ అదానీకి కట్టబెట్టింది. మరో గుత్తేదారు లేరన్నట్లు ఐదేళ్లలో 2 లక్షలా 76 వేల 333 కోట్లు రూపాయల విలువైన ప్రాజెక్టులు అప్పగించింది. ఈ స్థాయిలో ప్రాజెక్టులు కట్టబెట్టడం వెనుక ఉన్న ‘జగన్, అదానీ’ రహస్య బంధంపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా భారీ మొత్తంలో ముడుపులు అందాయన్నది వాస్తవమేనని తేలింది.
అదానీ అంటే జగన్.. జగన్ అంటే అదానీ:అదానీ సంస్థకు భారీ ప్రాజెక్టులను కట్టబెట్టడం వెనుకా జగన్ తన నైజాన్ని చూపారు. తొలుత ఆ సంస్థ ఒప్పందాలను కొనసాగించే విషయమై హైడ్రామా నడిపి తర్వాత రూ.లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు కట్టబెట్టారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చీరావడంతోనే 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటుకు అప్పటి టీడీపీ ప్రభుత్వంతో అదానీ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాన్ని కుదిస్తున్నట్లు డ్రామాకు తెరతీసింది. భూములు తీసుకుని కూర్చుంటే కాదు. నిర్దిష్ట ప్రతిపాదనలతో రావాలని ఎంత వ్యవధిలో ప్రాజెక్టు పూర్తిచేస్తాం? అనే దానిపై స్పష్టత ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది.
ప్రతిపాదనలు కుదించి 14 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా జగన్ ప్రభుత్వంతో అదానీ సంస్థ కొత్తగా ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత కొద్దినెలల్లోనే అదానీ అంటే జగన్, జగన్ అంటే అదానీ అనేంతలా బంధం పెనవేసుకుంది. తర్వాత నుంచి పెట్టుబడులు ప్రాజెక్టు పూర్తిచేసేందుకు కాలవ్యవధితో సంబంధం లేకుండా భారీ ప్రాజెక్టులు ఒక్కొక్కటీ అదానీ చేతికి అప్పగించింది జగన్ ప్రభుత్వం. డేటా సెంటర్ ఏర్పాటు కోసం విశాఖలో రెండుసార్లుగా 190.29 ఎకరాలను కేటాయించింది. ఆ భూముల విలువ సుమారు 3 వేల 58 కోట్ల రూపాయల ఉంటుందని అంచనా. అంత విలువైన భూములు కట్టబెట్టినా ఐదేళ్లలో డేటా సెంటర్ ప్రాజెక్టు పనులు వేగంగా నిర్వహించలేదు.
జగన్ అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్! - అవినీతిలో తగ్గేదేలే
డీల్ వెనుక జగన్ సర్కార్ బెదిరింపులు: ఇంధన రంగంలో పెట్టుబడులు పెడతామంటూ అదానీ దరఖాస్తు చేయడమే ఆలస్యమన్నట్లు పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపులను జగన్ ప్రభుత్వం త్వరితగతిన పూర్తిచేసింది. అదానీకి మేలు చేయడానికి ఒక్కరోజులోనే సెకి ద్వారా 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాన్ని చేసుకున్నట్లే 3 వేల 700 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు కట్టబెట్టింది. రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు దావోస్ వెళ్లి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టునూ అదానీ సంస్థ ప్రారంభించలేదు.
జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటాను 2020 అక్టోబరులో అదానీ సంస్థ చేజిక్కించుకుంది. ఈ డీల్ వెనుక జగన్ సర్కార్ బెదిరింపులకు పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన 25 శాతాన్ని 2021 ఏప్రిల్ 5వ తేదీన 2 వేల 800 కోట్ల రూపాయలకు చేజిక్కించుకున్నట్లు అదానీ సంస్థ ప్రకటించింది. గంగవరం పోర్టు లిమిటెడ్ కోసం విశాఖ ఉక్కు ప్లాంటుకు చెందిన 2 వేల 800 ఎకరాలు కేటాయించింది. DVS రాజు, విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు 89.6 శాతం వాటా, భూములు కేటాయించినందుకు ప్రభుత్వానికి 10.4 శాతం వాటా ఉండేలా కన్సార్షియాన్ని ఏర్పాటు చేశారు.
జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీవీఎస్ రాజును బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తర్వాత రాష్ట్రప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం ఈక్విటీని 645 కోట్లుకు అదానీ సంస్థకు ప్రభుత్వం విక్రయించింది. ఈ మొత్తాన్ని రామయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల అభివృద్ధికి ఈక్విటీ కింద వినియోగిస్తామని పేర్కొంది. దీనివల్ల ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు దక్కకుండా చేసింది. పారిశ్రామిక, వాణిజ్య కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు ఆర్‌డీఎస్‌ఎస్ (Revamped Distribution Sector Scheme) పథకం కింద స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను అదానీ సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ పనుల టెండర్లకు అదానీ, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ మాత్రమే బిడ్లు దాఖలు చేశాయి. ఎల్1గా నిలిచిన అదానీ సంస్థకు ప్రాజెక్టును జగన్ సర్కార్ కట్టబెట్టింది.
సొంతలాభం కోసం ప్రజలపై భారాన్నీ లెక్కచేయని జగన్
బొగ్గు సరఫరా టెండరునూ వదలని అదానీ:జెన్‌కో థర్మల్ కేంద్రాలకు విదేశీ బొగ్గు సరఫరా టెండరుని కూడా అదానీ కంపెనీ వదల్లేదు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రానికి 7.5 లక్షల విదేశీ బొగ్గు టన్నుకు 13 వేల100 రూపాయలు చొప్పున సరఫరా చేసే పనులనూ అదానీకే ప్రభుత్వం కట్టబెట్టింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు మధ్యప్రదేశ్‌లోని సులియారీలో ఉన్న బొగ్గు ప్రాజెక్టు నుంచి తవ్వితీసే బొగ్గును కొనుగోలు చేసే టెండరును జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా అదానీ పవర్‌కు కట్టబెట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లో 3 బీచ్ శాండ్ లీజుల్లో తవ్వకాలను అదానీ సంస్థకు కట్టబెట్టేందుకు జగన్ సర్కార్ విశ్వప్రయత్నాలు చేసింది. ఏపీఎండీసీ పేరిట శ్రీకాకుళం జిల్లా గారలో 2 లీజుల్లో 909 హెక్టార్లు, విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలోని 90 హెక్టార్లలో ఒక లీజు కలిపి గత ఏడాది డిసెంబరులో జగన్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. చిన్న సంస్థలేవీ టెండర్లు వేయకుండా బిడ్ దక్కితే వారంలో 100 కోట్లు జమ చేయాలనే నిబంధన పెట్టింది. మొత్తంగా ఈ టెండర్లలో మూడు సంస్థలు బిడ్లు వేశాయి. ఇందులో అదానీకి చెందిన అల్లూవియల్ హెవీ మినరల్స్ లిమిటెడ్ సైతం ఉంది. ఈ టెండర్లపై విశాఖకు చెందిన ఒకరు హైకోర్టులో పిల్ వేయడంతో టెండర్ల ప్రక్రియ ఆగింది.
అదానీ లంచం కేసు - వైఎస్సార్సీపీ సర్కార్‌కు భారీగా ముడుపులు