ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బుర్రకో బుద్ధి, జిహ్వకో రుచి - ‘ఫుడ్‌ బ్లాగింగ్‌’పై యువత ఇంట్రెస్ట్ - FOOD BLOGGERS IN AP

ఉద్యోగం చేస్తూనే ఆహార పదార్థాలకు ప్రచారం కల్పిస్తున్న యువత - ఆహార ప్రియులు, నిర్వాహకులకు మధ్య అనుసంధానం

Food Bloggers in AP
Food Bloggers in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2025, 5:28 PM IST

Food Bloggers in AP :నేటి కాలంలో ఏ సమాచారం కావాలన్నా ఫోన్​లో సెర్చ్ చేస్తుంటాం. మరి ఘుమఘుమలాడే రుచికరమైన బిర్యానీ తినాలంటే ఎక్కడికెళ్లాలి? స్నేహితులతో సరదాగా కబుర్లు చెబుతూ భోజనం చేయడానికి ఏ రెస్టారెంట్‌ అనుకూలం? పెసరట్టు ఉప్మా ఏ హోటల్‌లో బాగుంటుంది? ఇలాంటివి తెలియాలంటే సోషల్ మీడియాలో అనుసరిస్తే కాస్త సమాచారం దొరుకుంది. ఇంతకి ఫుడ్‌ బ్లాగర్స్ అంటే ఎవరు? వారు ఏం చేస్తారో తెలుసుకుందామా?

ఏమిటీ ఫుడ్‌ బ్లాగ్‌? : తినడంపై ఇష్టంతో పాటు కంటెంట్‌ గురించి బాగా తెలుసుంటే సృజనాత్మకతను పంచుకోవడానికి ఫుడ్‌ బ్లాగింగ్‌ ఒక గొప్ప వేదిక. ఇష్టమైన వంటకాలు, చెఫ్‌లు, రెస్టారెంట్‌లు, తినడానికి ప్రత్యేక స్థలాలు వంటి వాటి గురించి ఇందులో పోస్ట్ చేయవచ్చు. ఇది నిర్వాహకులు, ఆహార ప్రియులకు మధ్య అనుసంధానంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం యువత ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగాలు ఉండట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాలకు వెళ్తున్నా కొన్నిచోట్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అది కూడా రోజూ ఒకే రకమైన పని చేయాల్సి వస్తోంది.

దీంతో కొత్తదనం కోసం పలువురు యువతి, యువకులు ఫుడ్‌ బ్లాగింగ్‌ వైపు వెళ్తున్నారు. చిరు వ్యాపారులు తయారు చేస్తున్న ఆహార పదార్థాలకు ప్రచారం కల్పించడంతోపాటు వారి వ్యాపారం పెరిగేలా సహకరిస్తున్నారు. యువత ఇలా వీడియోలు తీస్తూ పెద్ద సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నారు. వారి ప్రేరణతో పలువురు సైతం అదే బాటలో పయనిస్తున్నారు. మరి సాగర తీరమైన వైజాగ్​లోనూ ఫుడ్‌ బ్లాగర్స్‌ హావా కొనసాగుతోంది.

Food Influencers in AP : విశాఖలో దీర్ఘకాలంగా 10 మందికి పైగా ఇలా వీడియోలు తీస్తూ క్రేజ్​ను సంపాదించుకున్నారు. వారి ప్రేరణతో పలువురు ఇందులో రాణిస్తున్నారు. బీటెక్‌ చదువుకునే సమయం నుంచే ఫుడ్‌ బ్లాగింగ్‌పై ఆసక్తి ఉందని చెబుతోంది ఎం.గాయత్రి శ్రీనిధి. రెండేళ్ల క్రితం వీడియోలు తీసి అప్‌లోడ్‌ చేయడం ప్రారంభించింది. వారాంతాల్లో స్నేహితుల సహకారంతో వీడియోలు తీస్తోంది. ఎడిటింగ్‌ తనే చేసుకుంటానని తెలిపింది.

పెద్ద రెస్టారెంట్ల గురించి ప్రచారం చేస్తే కొంత మొత్తం చెల్లిస్తారని ఎం.గాయత్రి శ్రీనిధి వెల్లడించింది. చిరు వర్తకుల వ్యాపారం పెరిగేలా వారి వీడియోలు ఎక్కువగా చేస్తానని వివరించింది. ఓ వైపు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేస్తూ ఫుడ్‌ బ్లాగింగ్‌ సాగిస్తున్నానని తెలిపింది. ఇన్‌స్టా, యూట్యూబ్‌లో వేల మంది అనుసరిస్తున్నారు, కొంచెం కష్టమనిపించినా ఇష్టంతో ముందుకు సాగుతున్నానని ఎం.గాయత్రి శ్రీనిధి పేర్కొంది.

గాజువాకకు చెందిన పి.జోగేశ్వరరావు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. విధులు పూర్తయ్యాక, వారాంతాల్లో ఆహార విక్రయాల వీడియోలు తీస్తుంటానని తెలిపారు. ఎక్కువ మందికి తెలియని పోషకాహారం, పరిశుభ్రత పాటించే దుకాణాలను ఎంపిక చేసుకుంటానని పేర్కొన్నారు. చిరు వర్తకుల వ్యాపారం మెరుగుపడేందుకు వారి వీడియోలు అప్‌లోడ్‌ చేస్తానని చెప్పారు. వారు ఫోన్‌ చేసి విషయం చెబితే చాలా గర్వంగా అనిపిస్తుందన్నారు. ఇన్‌స్టా, యూట్యూబ్‌లో వేల మంది అనుసరిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి వినూత్న వీడియోలు తీయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని పి.జోగేశ్వరరావు వెల్లడించారు.

12AM బిర్యానీ-4AM స్పెషల్ బిర్యానీ! విశాఖలో నయా ట్రెండ్

బిర్యానీ 4రూపాయలకే! - అనకాపల్లిలో బంపర్ ఆఫర్

ABOUT THE AUTHOR

...view details