YCP Leaders Looted Crores Of Rupees in Jagananna Colonies : జగనన్న కాలనీలు అంటే వైఎస్సార్సీపీ నాయకుల దోపిడీ కేంద్రాలుగా పేరొందాయి. భూసేకరణ పేరిట పెద్దఎత్తున దోచేశారన్న ఆరోపణలే అందుకు నిదర్శనం. అంతటితో ఆగిపోకుండా విద్యుదీకరణ పనులు, విద్యుత్తు కనెక్షన్ల పేరుతో కోట్ల రూపాయల దందా సాగించిన తీరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బయటపడింది. జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి తెరవెనుక చక్రం తిప్పి అనుచరుడికి లబ్ధి చేకూర్చేలా చేసిన తీరుపై కథనం.
జనావాసాలకు దూరంగా కనీస వసతులు లేని ప్రాంతాల్లో ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధిదారులను నిండా ముంచింది. కేటాయించిన స్థలాలకు వెళ్లడానికి రహదారులు లేక జనం ఇబ్బంది పడినా పట్టించుకోలేదు. కనీస వసతులు కల్పించలేదు. దీంతో చాలామంది ఇళ్లు కట్టుకోలేదు. కొండగుట్టల్లో కేటాయించిన భూములకు విద్యుత్ సౌకర్యం పేరిట వైఎస్సార్సీపీ నేతలు మాత్రం జేబులు నింపుకొన్నారు. విద్యుత్ తీగలు, మీటర్ బోర్డులు, MCB స్విచ్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు పేరుతో కోట్ల రూపాయలు వృథా చేశారు.
వైఎస్సార్సీపీ నేతలతో చేతులు కలిపిన అధికారులు - కోట్ల విలువైన ఇనుము మాయం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 576 కాలనీల్లో 2.12 లక్షల గృహాలకు లబ్ధిదారులను గుర్తించి నిర్మాణాలు చేపట్టారు. 9,387 గృహాలే పూర్తవగా వీటిలో కొన్నింటికే విద్యుత్ సర్వీసులు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణంలో పురోగతి లేకపోయినా విద్యుత్ సర్వీస్‌ల పేరుతో నిధులు స్వాహా చేశారు. జిల్లాలోని అనేక కాలనీల్లో ఇళ్లు పూర్తికాకున్నా కనెక్షన్లు ఇచ్చేసి పరికరాలు అమర్చారు. నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాన్ని బట్టి మీటర్లు, ఇతర పరికరాలు సరఫరా చేయాలి. కానీ కాలనీల్లో ఇళ్లు పూర్తికాకపోయినా విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు పెట్టేశారు.