Worst Ambulance Services in Combined Anantapur District:ఉమ్మడి అనంతపురం జిల్లాలో 108 అంబులెన్స్ అత్యవసర సేవలు తీసికట్టుగా మారాయి. నిర్వహణ గుత్తేదారు సంస్థ కనీసం 108 సేవల వాహనాలకు బీమా కూడా చేయకుండానే అత్యవసర రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30కి పైగా తుక్కుగా మార్చాల్సిన వాహనాలను రోగుల సేవలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
కాలంచెల్లిన 108 అంబులెన్స్‌ల్లో అత్యవసర వాహన సేవలు అందిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో 108 వాహన సేవలు ప్రారంభమయ్యాయి. తర్వాత టీడీపీ ప్రభుత్వం కూడా చక్కటి పర్యవేక్షణతో సేవలు కొనసాగించింది. గత ఐదేళ్లలో గుత్తేదారు ఏఈఎంఎస్ సంస్థ పూర్తిగా 108 వాహన సేవలను తీసికట్టుగా మార్చేసింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 63 వాహనాలు 108 సేవలు అందిస్తున్నాయి. గ్రామాల్లో సంచార వైద్య సేవలు అందించడానికి 104 సేవల వాహనాలు 63 ఉన్నాయి. ఇవి కాకుండా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కింద సేవలు అందించడానికి మరో 12 వాహనాలున్నాయి. ఇవి కాకుండా ఉమ్మడి జిల్లాలో తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్‌లు 38 వాహనాలున్నాయి. ఈ వాహనాలన్నిటినీ ప్రభుత్వం కొనుగోలు చేసి, నిర్వహణ కోసం గుత్తేదారుకు అప్పగించింది.
చంద్రబాబుకు ముద్దు పెట్టబోయిన మహిళ- అడ్డుకున్న సెక్యూరిటీ
వాహన నిర్వహణ, డీజిల్, పెట్రోల్, డ్రైవర్లు, సహాయకులు, పర్యవేక్షకుల వేతనాలకు ప్రతి వాహనానికి ప్రభుత్వం లక్షల రూపాయలు చెల్లిస్తోంది. వీటి నిర్వహణ కోసం ఏఈఎంఎస్ సంస్థ కనీసం మెకానిక్ షెడ్డును కూడా ఏర్పాటు చేసుకోలేదు. ప్రభుత్వం నుంచి ప్రతినెలా కోట్ల రూపాయలు పొందుతున్న గుత్తేదారు సంస్థ వాహనాలను రోడ్లపైనే నిలబెట్టి మరమ్మతులు చేస్తోంది. రాప్తాడులో నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కార్యాలయ చిన్నపాటి గదిని తీసుకొని వాహనాలకు అక్కడే మరమ్మతులు చేస్తున్నారు. 108 వాహనాలకు కొన్నేళ్లుగా బీమా కూడా చేయించలేదు.
అరిగిన టైర్లు, బంపర్ మొదలు, వాహన డోర్ల వరకు ఊడిపోయే స్థితిలో ఉన్నా కనీసం వాటికి మరమ్మతులు చేయించడంలేదు. 5 లక్షల కిలోమీటర్లు తిరిగాక, పక్కన పెట్టేయాల్సిన ఈ వైద్య సేవల వాహనాలను 7 లక్షలకుపైగా కిలోమీటర్లు తిప్పుతున్నారు. ఈ సేవలు అందిస్తున్న డ్రైవర్లు, ఇతర సిబ్బందికి 3 నెలలుగా గుత్తేదారు సంస్థ వేతనాలు కూడా బకాయి పడినట్లు తెలుస్తోంది. గుత్తేదారు సంస్థ తీరుపై అధికారులు విచారణ చేస్తే అనేక అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
శిథిలావస్థలో అంబులెన్సులు - వాహనాల నిర్వహణను పట్టించుకోని గుత్తేదారు సంస్థ (ETV Bharat) 108 వాహనాల పర్యవేక్షణ తమ పరిధిలోకి రాదన్నట్లుగా జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. లోపభూయిష్టంగా సేవలు అందుతున్న వైనంపై విచారణ చేస్తామంటూ అధికారులు సమాధానం చెబుతున్నారు. గతంలో 108 సేవలతో సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి అనేక మంది ప్రాణాలు నిలిపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గత ఐదేళ్లలో గాడితప్పిన ఈ సేవలను మళ్లీ దారిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆ సేవల్లో పాల్గొంటున్న సిబ్బంది చెబుతున్నారు.
బొమ్మిడాయి రూపం పులస రుచి - ఈ చేపను ఒక్కసారి తిన్నారంటే ఆహా అనాల్సిందే!
సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు - ఏపీ భవిష్యత్ మార్చేలా కొత్త ప్రణాళిక