Next CS in AP :ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది జూన్ 7న సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన పదవీకాలం ఆ నెలాఖరుతోనే ముగిసింది. 6 నెలల పాటు సీఎస్ పదవి కాలాన్ని పొడిగించాలని ఏపీ సర్కార్ కేంద్రాన్ని కోరడంతో ఆ మేర అనుమతులు వచ్చాయి. మరోసారి ఇంకో ఆరు నెలలు పొడిగించేందుకు అవకాశం ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ఆ దిశగా ప్రయత్నాలేమీ లేకపోవడంతో ఈ నెలాఖరుకు నీరభ్ కుమార్ పదవీ విరమణ చేయడం ఖరారైంది.
ఇప్పుడు కొత్త సీఎస్ ఎవరనేది పరిశీలిస్తే సీనియరిటీ ప్రకారం 8 మంది పేర్లు జాబితాలో ఉన్నాయి. సీనియారిటీ ప్రకారం వివాదాస్పద అధికారిణి శ్రీలక్ష్మీ, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఇతర సర్వీసుల్లో ఉన్న సుమిత దావ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఉన్నారు.
వీరిలో వైఎస్సార్సీపీ అనుకూల అధికారులుగా ముద్రపడిన శ్రీలక్ష్మీ, అజయ్ జైన్‌ను సీఎస్ ఎంపిక పరిశీలనలోకి ముఖ్యమంత్రి తీసుకోరని తెలుస్తోంది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సుమిత దావ్రా పేరు పరిశీలనలోకి రాదు. మిగిలిన ఐదుగురిలో పదవీ విరమణకు దగ్గర్లో ఉన్నవారికి సీఎం ప్రాధాన్యం ఇస్తారా? లేక సీనియారిటీ ప్రకారం పదవీకాలం ఎక్కువ ఉన్న వారిని పరిగణలోకి తీసుకుంటారా? అని వేచిచూడాలి.