Disappearing Wedding Traditions : పిన్నీ మా ఇంట్లో పెళ్లి పందిరి వేస్తున్నాం మీరందరూ తప్పక రావాలి. ఎక్కడికి వెళ్లొస్తున్నావు అక్కా? పక్క వీధిలో రామాయమ్మ కుమార్తెను పెళ్లికూతురిని చేసి వస్తున్నాం. పేరాంటాళ్లు ఎక్కడికెళ్లారే. పెళ్లికుమారుడి మంగళస్నానానికి బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తోడుకురావాలి. వీధిలోకి వెళ్లి అందరినీ కత్తిపీటలు తీసుకొని కూరగాయలు కొయ్యడానికి పిలవండర్రా వదినా! బియ్యం నూక ఉప్మా అయినా ఎంత రుచిగా ఉందో.
ఇంట్లో చేసుకుంటే ఇంత రుచి రాదెందుకే? బావా సాంబారు ఇంకాస్త పొయ్యనా? మరదలు పిల్లా సాంబారు వడ్డించడమేనా? నువ్వు పప్పన్నం పెట్టేదుందా? ఇలాంటి మాటలు ఇప్పుడు జరుగుతున్న పెళ్లిల్లో వినిపించడం లేదు. ఏవండీ సాయంత్రం మన ఊరి ఫంక్షన్ హాల్లో మా బాబాయి కుమార్తె రిసెప్షన్ ఉంది. త్వరగా వస్తే గిఫ్ట్ ఇచ్చి ఫొటో దిగి తినేసి వచ్చేద్దాం ఇలాంటి పిలుపులే ఇప్పుడు వినిపిస్తున్నాయి.
పట్టణాల్లో ఫంక్షన్ హాళ్లలో వివాహాలు జరగడం అనేది ఎప్పటినుంచో జరుగుతున్నదే. కానీ ప్రస్తుతం గ్రామాల్లో కూడా పెళ్లిళ్లు ఇళ్లముందు జరగడం లేదు. మండల కేంద్రంలో లేక సమీప పట్టణాల్లోని కల్యాణ మండపాలను బుక్ చేసుకుని నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల్లో కూడా సౌకర్యాలతో కూడిన కల్యాణ మండపాలు అందుబాటులో ఉన్నాయి. దగ్గర బంధువులు ఆ ముహూర్తం సమయానికి వచ్చి అక్షింతలు వేసి ఫొటోకి పోజిచ్చి రెండు మెతుకులు తినేసి పోతున్నారు.
Outdated Wedding Traditions :మనుషులు ఎంత బిజీ అయిపోయారంటే ఒక ఇంట్లో జరగాల్సిన నిశ్చితార్థం కూడా ఫంక్షన్ హాళ్లో జరిపిస్తున్నారు. అసలు పెళ్లిచూపులే ఉండడం లేదు. అవీ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయంటే నమ్మగలరా? కల్యాణ మండపంలో వివాహం చేసినా ఇంటిముందు పందిరి వేయడం సంప్రదాయం. దీన్ని పాటించే వారు అరుదు. కల్యాణ మండపం బుక్ చేసుకున్న దగ్గర నుంచి భోజనాలు, డెకరేషన్, మంగళస్నానం చేయించడం అన్నీ ఎవరికో గుత్తేదారులకు అప్పగిస్తున్నారు.