Vyjayanthi Novel Launch Event :"వైజయంతి విహారి-జగన్నాథ పండితరాయలు" గ్రంథావిష్కరణ సభ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. రవీంద్రభారతి సమావేశ మందిరంలో ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సుధామ సృజనకర్తగా పేరుగాంచిన విహారి సంపాదకత్వంలో తీర్చిదిద్దిన 'సప్తశతి' (సప్తపదుల కవితా సంకలనం)తో పాటు ఆయన స్వయంగా రచించిన 'వైజయంతి'(జగన్నాథ పండితరాయలు) నవలా సమాలోచన ఆవిష్కరణ సభ జరిగింది. ప్రభుత్వ మాజీ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.కె.వి.రమణాచారి ఈ 2 పుస్తకాలను ఆవిష్కరించారు.
యాభై ఏళ్ల తపస్సు : పుస్తకాల ఆవిష్కరణ అనంతరం విశ్రాంత ఐఏఎస్ కేవీ రమణాచారి మాట్లాడుతూ వైజయంతి నవల ఊహాత్మకమే అయినప్పటికీ విహారి 50ఏళ్లు శోధించి రాశారని ప్రశంసించారు. తానూ పదేళ్లు ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖకు సలహాదారుగా ఉన్నానని రమణాచారి గుర్తుచేసుకున్నారు. ఈ రోజుల్లో ప్రభుత్వ సలహాదారుగా ఉండటమంటే పాముతో చెలగాటమాడినట్లేనని, పాము పడగ నీడలో కప్ప ఉన్నట్లుగా ఉంటుందన్నారు. సలహాదారుగా చాలా ఆచితూచి వ్యవహారించాల్సి ఉంటుందని వ్యక్తీకరించారు.
"సాహిత్యంలో స్వేచ్ఛగా విహరించే కథరాజు మా విహారి అని నేను అంటుంటాను. ఈరోజు సభ ప్రాంగణంలో కూడా తను తనకు నచ్చిన విధంగా విహరిస్తూనే ఉన్నారు. ఒక పుస్తకం ఆవిష్కరింపబడిందా లేదా అనే ఆలోచనను కలిగిస్తున్న సందర్భమిది. పండితరాయలు అనే నవల సాహితీ లోకంలో విహరిస్తూ ఉంది." -కేవీ రమణాచారి, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు