VRO Land Grabs Along with YSRCP Leaders: జగనన్న రీసర్వే ఓ వీఆర్వోకు భూములు కొల్లగొట్టేందుకు మార్గం సుగమం చేసింది. దశాబ్దాల నాటి భూ రికార్డులను శోధించి, ఆధారాలు లేని నిరుపేద హక్కుదారుల భూములే లక్ష్యంగా కబ్జాలకు దిగాడు. ఇలా వందల ఎకరాలు కాజేశాడు శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలోని వీఆర్వో. వైసీపీ నాయకుడి అండదండలతో ఆరేళ్లుగా చెన్నేకొత్తపల్లి మండలంలోనే విధులు నిర్వహిస్తూ భూ దందాలు, సెటిల్మెంట్లు, అక్రమాలతో అవినీతికి పాల్పడుతూ 50 కోట్లరూపాయలు ఆర్జించాడు.
శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి వీఆర్వో పేరు చెబితే దళిత రైతులు బెంబేలెత్తిపోతున్నారు. మగదిక్కు లేని నిరుపేద రైతు కుటుంబాలైతే తమ భూమిని ఎప్పుడు కబ్జా చేస్తాడోనని భయాందోళనకు గురవుతున్నారు. ఆరేళ్ల క్రితం చెన్నేకొత్తపల్లికి వీఆర్వోగా వెళ్లిన ఆయన వైసీపీ సర్కారు రావటంతోనే అక్రమాలకు తెరలేపాడు. కియా పరిశ్రమ వచ్చాక సీకేపల్లిలో భూముల విలువలు భారీగా పెరిగాయి.
సంతకాలు ఫోర్జరీ చేసి భూములు దోపిడీ - రెచ్చిపోతున్న వైసీపీ మూకలు
రీ సర్వేలో భాగంగా ఆయా భూముల రైతుల వద్ద యాజమాన్య హక్కు నిర్ధారించే ఆధారాలు ఉంటే సెటిల్మెంట్, లేకుంటే విక్రయ అగ్రిమెంట్ల పేరుతో ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకుని భూమిలోకి దిగుతున్నాడు. బాధితులు నెత్తీనోరూ బాదుకున్నా పట్టించుకోడు. పోలీసుల సహకారంతో కోర్టు వివాదాల్లో ఉన్న భూములను కబ్జా చేస్తున్నాడని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.