Volunteer Died in Suspicious Manner:ఒకే నెలలో ఇద్దరు వాలంటీర్లు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే, మృతి చెందిన ఇద్దరు వాలంటీర్లు ఏ కారణంతో మృతి చెందారనే అంశం మిస్టరీగా మారింది. ఈ నెల 1వ తేదీన ఓ వాలింటీర్ మృతదేహం రైలు పట్టాలపై అనుమానాస్పద రీతిలో లభించింది. మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మరో వాలంటీర్ నేడు బావిలో శవమై కనిపించాడు.
రాణిగారి తోట సమీపంలో మృతదేహం: విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం 15వ వార్డు వాలంటీర్‌గా పని చేస్తున్న ఆలబోను వెంకట సాయి రామకృష్ణ (24) సోమవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. మూడు రోజులు క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన రామకృష్ణ తిరిగి రాలేదు. అతని ఫోన్ సైతం పని చేయలేదు. ఆందోళన చెందిన రామకృష్ణ కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. సోమవారం రాణిగారి తోట సమీపంలోని నేలబావిలో రామకృష్ణ మృతదేహం లభించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
వెంకట సాయి రామకృష్ణ గత నాలుగు సంవత్సరాలుగా 15వ వార్డులో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రామకృష్ణది హత్యా లేదా ఆత్మహత్యా అనే విషయం తెలియాల్సి ఉంది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ నాగేశ్వరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హత్యా, లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తామని తెలిపారు.