కబంధహస్తాల నుంచి బయటపడ్డట్టే - దిమ్మతిరిగేలా విశాఖ ప్రజల తీర్పు (ETV Bharat) Visakhapatnam People Shock to YSRCP: వైఎస్సార్సీపీ ఐదేళ్లులో విధ్వంసకర పాలనా విధానాలతో విశాఖ విలవిల్లాడిపోయింది. ప్రజా వ్యతిరేక పనులు, తీసుకున్న చర్యల నుంచి విముక్తి పొందేందుకు జనం ఎంత కసిగా ఓటేశారో ఫలితాల సరళి చూస్తేనే అర్థమవుతుంది. సముద్రానికి అభిముఖంగా పచ్చని కొండ. దానిపై పర్యాటకశాఖ భవనాల్లో పర్యాటకులకు వసతి, భోజన సదుపాయాలుండేవి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక బాగున్న భవనాలను కూల్చేశారు. రుషికొండకు గుండుకొట్టి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించారు. 450 కోట్ల ప్రజాధనం వెచ్చించి విలాసవంతమైన భవనాలు నిర్మించారు.
పర్యాటకులకు ఆంక్షలు పెట్టారు. రుషికొండకు రెండో వైపు ఉన్న రహదారిని పూర్తిగా మూసేశారు. హెలిప్యాడ్ కోసం పర్యాటక భవనాలు కూలగొట్టారు. రుషికొండపై జరిగిన విధ్వంసం తీరు ప్రజల మనసులో నాటుకుపోయింది. ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా రావడం మొదలవ్వగానే అక్కడి సెక్యూరిటీని తప్పించుకుని ఇద్దరు రుషికొండ భవనాలపైకి వెళ్లి టీడీపీ జెండా ఎగుర వేయడం కలకలం రేపింది. ఇకపై ఈ భవనాలు ఎలా ఉపయోగిస్తారో చూడాల్సి ఉంది. రుషికొండ వద్ద ఆంక్షలు తొలగించి, రెండో రోడ్డును తెరవాలంటూ నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు, నేతలు - నిన్నటి వరకు కాల్స్‌లో మాట్లాడాలన్నా భయమే - Officers and leaders got Freedom
వాస్తు దోషమన్న కారణంతో: నగరంలో సిరిపురం వద్ద టైకూన్ కూడలిని గత ఏడాది మూసివేశారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా దాన్ని మూసివేశామంటూ జీవీఎంసీ, పోలీసు అధికారులు తెలిపారు. వాస్తవానికి ఆ కూడలి ఎదురుగా వివాదాస్పద సీబీసీఎన్సీ స్థలంలో వైఎస్సార్సీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ భారీ ప్రాజెక్టు చేపడుతున్నారు. దానికి వాస్తు దోషమన్న కారణంతోనే టైకూన్ జంక్షన్ మూసి వేశారనే చర్చ సాగింది. దీంతో దత్ ఐలాండ్ నుంచి వీఐపీ రోడ్డుకు వెళ్లాలంటే ఫ్లైఓవర్ వరకు వెళ్లి తిరిగి రావాల్సిన పరిస్థితి ఉండేది. దీనిపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలన చేసి, డివైడర్లు తొలగించాలంటూ డిమాండ్ చేశారు. వాటిని తొలగించడానికి ప్రయత్నించిన టీడీపీ, జనసేన, భాజపా కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తరలించి కేసులు పెట్టారు. కూటమి అధికారంలోకి రాగానే అక్రమాలపై తొలి ఉక్కుపాదం మోపారు. బుధవారం టైకూన్ జంక్షన్లో డివైడర్లను, స్టాపర్లను జేసీబీలతో నేతలు తొలగించారు.
రాత్రికి రాత్రే వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా: విశాఖ బీచ్ రోడ్డులో తెన్నేటిపార్కు దాటిన తర్వాత సీతకొండ వద్ద వ్యూపాయింట్ ఉంది. దీనిని గతంలో అబ్దుల్ కలాం వ్యూపాయింట్‌గా పిలిచేవారు. గతేడాది G-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో నగరంలో సుందరీకరణ పనులు చేపట్టారు. సదస్సు రెండు రోజుల్లో ప్రారంభమవుతుందనగా రాత్రికి రాత్రే వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా బోర్డు ఏర్పాటు చేశారు. అమర్‌నాథ్, ఇతర మంత్రులు సైతం లవ్ వైజాగ్ సింబల్ పక్కనే ఉన్న వైఎస్సార్ వ్యూపాయింట్ పేరు వద్ద ఫొటోలు దిగారు. కూటమి విజయకేతనం ఎగుర వేయడంతో అబ్దుల్ కలాం వ్యూపాయింట్‌గా గుర్తుతెలియని వ్యక్తులు మార్చేశారు.
డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని నిర్ణయం - బదిలీ ఆదేశాలు సైతం నిలిపివేత - Govt Denies to Relieve Officers
కొత్త ప్రభుత్వం తేల్చాల్సిన విషయాలు: సేవ పేరుతో తీసుకుని వైఎస్సార్సీపీ పెద్దలు వ్యాపారం చేసిన హయగ్రీవ, సెయింట్‌లూక్స్ వంటి విలువైన స్థలాలపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. వివాదాల్లో ఉన్న స్థలాల్లో పాగా వేసిన వైఎస్సార్సీపీ నేతలు పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. న్యాయ వివాదాల్లో ఉండగానే సీబీసీఎన్సీకి సంబంధించి మాస్టర్‌ప్లాన్ రోడ్డు విస్తరణలో కోల్పోయిన భూమికి వైఎస్సార్సీపీ నేత ఎంవీవీ సత్యనారాయణకు 63 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్లను అధికారులు ఇచ్చేశారు. ఎంతో విలువైన దసపల్లా భూములు కూడా చేతులు మారాయి. కబ్జాకు గురైన విలువైన భూములు, అదే విధంగా 596 జీవో తెచ్చి పేదలను బెదిరించి లాక్కొన్న అసైన్డ్ ల్యాండ్స్ వ్యవహారం కొత్త ప్రభుత్వం తేల్చాల్సి ఉంది.
విశ్వవిద్యాలయాన్ని ప్రక్షాళన చేస్తేనే: ఎన్నికల ఫలితాలతో విముక్త ఆంధ్రప్రదేశ్ చేశారు. మరి విముక్త ఆంధ్ర వర్సిటీ ఎప్పుడు చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వీసీ ప్రసాద్‌రెడ్డి వర్సిటీని వైఎస్సార్సీపీ కార్యాలయంగా మార్చేశారన్న ఆరోపణలున్నాయి. ఏయూలో పచ్చని చెట్లు కొట్టి, నీటి వనరులు పూడ్చి ప్రకృతి విధ్వంసం చేశారు. శిష్యుడైన జేమ్స్ స్టీఫెన్‌ను రిజిస్ట్రార్‌గా నియమించడంలో చక్రం తిప్పారని, ఎన్నికల వేళ కళాశాల యాజమాన్యాలతో వైఎస్సార్సీపీకి అనుకూలంగా విద్యార్థులతో ఓట్లు వేయించేలా మీటింగ్‌లు పెట్టారని, బొత్స ఝాన్సీకి ఓటెయ్యాలంటూ విద్యార్థులతో సర్వే పేరు చెప్పి ఫోన్లు చేయించిన ఉదంతాలు ఉన్నాయని కూటమి నేతలు చెబుతున్నారు. విశ్వవిద్యాలయాన్ని ప్రక్షాళన చేస్తేనే విద్యావ్యవస్థకు గౌరవం దక్కుతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణా రెడ్డి రాజీనామా - AP Government Advisor