ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ బాలికల జువెనైల్‌ హోం ఘటన - మంత్రి ఏమన్నారంటే? - VISAKHAPATNAM JUVENILE HOME ISSUE

విశాఖలోని జువెనైల్‌ హోం వద్ద రెండో రోజూ ఉద్రిక్తత - హోమ్‌ సిక్‌తో, ఇంటికెళ్లాలనే అలా ప్రవర్తించారని అధికారులు చెప్పారన్న మంత్రి సంధ్యారాణి

Visakhapatnam_Juvenile_Home_Issue
Visakhapatnam Juvenile Home Issue (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2025, 4:04 PM IST

Updated : Jan 23, 2025, 6:25 PM IST

Visakhapatnam Juvenile Home Issue: విశాఖపట్నంలోని ప్రభుత్వ ప్రత్యేక బాలికల వసతి గృహం (జువైనల్‌ హోం) ఎదుట రెండవ రోజూ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమను బయటకు పంపాలంటూ బాలికలు గోడ దూకి బయటకు పారిపోయే ప్రయత్నం చేశారు. బుధరావం జరిగిన ఘటనపై విచారణ జరిపేందుకు విద్యార్థి, మహిళ, బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు జువెనైల్‌ హోంకి చేరుకున్నారు. అయితే వారిపై కూడా బాలికలు రాళ్లు విసిరారు. తమను బయటకు పంపాలంటూ అరుస్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించారు.

తమకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరిస్తూ బాలికలు బోరున విలపించారు. వసతి గృహం లోపల బాలికలకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపించడంతో పాటు వారి మానసిక పరిస్థితి కోసం మెరుగైన చికిత్స అందించాలని మహిళ సమాఖ్య, బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు కోరారు.

మరోవైపు విశాఖ బాలికల జువెనైల్‌హోం ఘటనపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. కలెక్టర్‌తో మాట్లాడి పోలీసుల సాయంతో ముగ్గురు బాలికలను ఇళ్లకు చేర్చినట్లు చెప్పారు. బాలికలు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టినట్లు మంత్రి వివరించారు. హోమ్‌ సిక్‌తో, ఇంటికెళ్లాలనే అలా ప్రవర్తించారని అధికారులు చెప్పారన్నారు. బాలికలు రెండు రోజులుగా మందులు వేసుకోలేదని సంధ్యారాణి వివరించారు. పోలీసుల సమక్షంలో బాలికలను ఇళ్లకు పంపిస్తున్నామని మంత్రి సంధ్యారాణి అన్నారు.

ఇదీ జరిగింది:కాగా విశాఖలోని జువెనైల్‌ హోమ్‌ బాలికలు బుధవారం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఐదుగురు బాలికలు రక్షణ గోడపైనున్న ఇనుప కంచె దాటుకుని వచ్చి మరీ రోడ్డుపైన నిరసన తెలిపారు. తమకు నరకం చూపిస్తున్నారని, మత్తుమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారని వాపోయారు. తమను ఇళ్లకు పంపించాలంటూ రోడ్డుపై వెళ్తున్నవారికి దండం పెడుతూ అభ్యర్థించారు.

దీనిపై జువెనైల్‌ హోం పర్యవేక్షకురాలు ఏవీ సునీత స్పందించారు. బాలికల మానసిక పరిస్థితి బాగోలేదని, వారంలో రెండుసార్లు చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. మాత్రలు వేసుకోకుండా, భోజనం చేయకుండా, గట్టిగా అరుస్తూ, చేతులపై రాళ్లతో కోసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. బాలికల పరిస్థితిని ఎప్పటికప్పుడు చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. కమిటీ నిర్ణయం మేరకే బాలికలను కుటుంబసభ్యులతో పంపిస్తామని వివరించారు.

'జువైనల్‌ హోమ్‌లో వేధిస్తున్నారు!' - ప్రహరీ గోడ దూకి బయటకు వచ్చిన బాలికలు

Last Updated : Jan 23, 2025, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details