ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"నేను కూడా సైబర్‌ నేరగాళ్లకు టార్గెట్టే" - ఆ నంబర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి : విశాఖ సీపీ

సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ - తెలియని నంబర్ల నుంచి ఫోన్ వస్తే ఆర్థికపరమైన వివరాలు ఇవ్వద్దని సూచన

Visakha City Police Commissioner Sankhabrata Bagchi
Visakha City Police Commissioner Sankhabrata Bagchi (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Visakha City Police Commissioner Sankhabrata Bagchi :ఏపీలో సైబర్‌ మోసాల బాధితులు విశాఖలోనే ఎక్కువ అనేది నిన్నటి మాట. విశాఖనే కేంద్రంగా చేసుకొని పలు ప్రాంతాల వారిని మోసగించే ముఠాలు ఉన్నాయనేది నేటి మాట. కొల్లగొట్టిన సొమ్మును కమీషన్ల ఆశ చూపి తీసుకున్న బ్యాంకు ఖాతాల నుంచి చట్టవిరుద్ధమైన పేమెంట్‌ గేట్‌వేల ద్వారా చైనాకు తరలించినట్లు వెలుగుచూసింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పలు సైబర్‌ నేరాల మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నట్లు తేలడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ ముఖాముఖి

సైబర్‌ క్రైంపై శిక్షణ :గతంలో సైబర్‌ నేరగాళ్లు ఒంటరిగా పని చేసేవారని, ప్రస్తుతం గ్యాంగ్‌లుగా రెచ్చిపోతున్నారని శంఖబ్రత బాగ్చీ తెలిపారు. కంబోడియా, మయన్మార్, వియత్నాం, అజర్‌బైజాన్‌ వంటి చోట్ల కేంద్రాలు పెట్టి భారతీయులను లక్ష్యంగా చేసుకున్నారని గుర్తు చేశారు. ఇటీవల ఓ ముఠా రాష్ట్రంలోని దాదాపు 85 మందిని ఉద్యోగాల పేరుతో కంబోడియా తీసుకువెళ్లిందని, అక్కడికి వెళ్లాక సైబర్‌ నేరాలు చేయాలని వేధించిందని అన్నారు. నిరాకరించిన వారిని చిత్రహింసలకు గురి చేశారని, సైబర్‌ క్రైంపై కొన్నాళ్ల శిక్షణ తర్వాత ప్రతి రోజూ కొందరి ఫోన్‌ నంబర్లతో ఒక జాబితా ఇచ్చారని, ఫోన్‌ చేయించి నమ్మకంగా ఖాతాల్లో డబ్బులు మొత్తం లాగేసే వ్యూహాలు అమలు చేయించారని వెల్లడించారు.

'బ్యాంక్ అకౌంట్ మనదే' - కానీ ట్రాన్సాక్షన్స్ వాళ్లవి

తెరవెనుక అసలు సూత్రధారులు :కంబోడియా తరహా మోసాల కేంద్రం ఇటీవల విశాఖలో వెలుగు చూపిందని, దాడులు చేసి నిందితులందరిని అరెస్టు చేశామని గుర్తు చేశారు. కాస్మోటిక్‌ ఉత్పత్తుల ముసుగులో చైనీస్‌ స్కాం (సైబర్‌ క్రైం) చేస్తున్నారని, చట్టవిరుద్ధ పేమెంట్‌ గేట్‌వే ద్వారా రూ.కోట్ల నగదు చైనా, తైవాన్‌లో ఉన్న వారికి చేరవేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. చైనాకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకుని విశాఖకు తీసుకు రాబోతున్నామని, అతన్ని విచారణ చేస్తే తెరవెనుక అసల సూత్రధారులు ఎవరనేది గుర్తించగల్గుతామని, మోసం చేసిన నగదు ఎక్కడ దాచారో కనుక్కుంటామని అన్నారు.

సూచనలు : తాను కూడా సైబర్‌ నేరగాళ్లకు టార్గెట్టేనని, తెలిసిన వ్యక్తి ఫోన్‌ చేస్తే తప్ప, అనుమానాస్పద కాలర్‌ నుంచి వచ్చిన ప్రతి ఫోన్‌ సైబర్‌ మోసగాళ్ల నుంచి వచ్చినట్లుగా భావించాలని సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ప్రతి ఎస్‌ఎంఎస్, వాట్సప్‌ మెసేజ్‌లు సైతం అలానే భావించాలని, అప్పుడే సైబర్‌ మోసాల నుంచి తప్పించుకోగల్గుతారని అన్నారు. కేసులు, పోలీసులు, సీఐడీ, సీబీఐ అంటూ డిజిటల్‌ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్‌ నమ్మొద్దని, ఒక వేళ మోసపోతే 1930 నెంబరుకు గంటలోపు కాల్‌ చేయండని తెలిపారు.

డబ్బులు లేవంటే రుణం ఇప్పించి మరీ మోసం చేశారు !

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండని, లేదంటే మీ నగదు వేరే దేశానికి వెళ్లిపోతుందని అన్నారు. అప్పుడు ఫ్రీజ్‌ చేయడం కుదదరని, ఫ్రీజ్‌ చేసిన నగదు బాధితులకు అందేలా కసరత్తు చేస్తున్నామని అన్నారు. ఇటీవల ఇలా రూ.1.20కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. 2 విడతగా మరో రూ.కోటి అందజేయనున్నామని తెలిపారు. సైబర్‌ నేరాల బారిన పడకుండా ఎలా అనే అంశంపై విద్యాలయాల్లో అవగాహన కల్పిస్తున్నామని, సైబర్‌ మోసాలకు దారి తీసే 30 అంశాలపై డాక్యుమెంట్‌ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

అలా చేస్తే జైలుపాలవుతారు : నగదు తక్కువగా ఉన్న బ్యాంకు ఖాతాలెవరివో గుర్తించి ఎర వేస్తారని, ఖాతా ఇస్తే కమీషను ఇస్తామని ఆశ చూపుతారని, అలా దానిని సైబర్‌ నేరాలకు ఉపయోగిస్తారని అన్నారు. దీని వల్ల ఖాతాదారులు మోసపోవడమే కాదు. చివరికి జైలుపాలవుతారని హెచ్చరించారు. వీడియోలు, ఫొటోలు మార్ఫింగ్‌ చేసి భయపెట్టేందుకు ప్రయత్నించే వారి ఫోన్‌ నంబర్‌ను వెంటనే బ్లాక్‌ చేయాలని సూచించారు. వారి మాటలకు లొంగి భయపడితే నగదు డిమాండ్‌ చేస్తారని, ఒక్క పైసా కూడా ఇవ్వకుండా పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమాచారం బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.

"ఆ స్టాక్​లో కళ్లు చెదిరే లాభాలు" - ఏడు బ్యాంకు ఖాతాలకు రూ.1.21 కోట్లు - ఏమైందంటే!

ABOUT THE AUTHOR

...view details