Virtual Postmortem Technology Facilities in Andhra Pradesh :మృతదేహాన్ని కత్తితో చీల్చి పుర్రె పగలగొట్టి మరణాలకు గల కారణాలను వెలికితీయడం శవపరీక్షలోని పాత పద్ధతి. ఇలాంటివేమీ లేకుండా కత్తి గాటు పెట్టకుండా మృతదేహాన్ని బ్యాగ్‌లో చుట్టి మెషీన్‌లో పంపడం నయా ట్రెండ్ ఇప్పుడు డిజిటల్ అటాప్సీల కాలం నడుస్తోంది. ఈ విధానంతో ప్రయోజనాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసింది. వర్చువల్ అటాప్సీ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపితే సంబంధిత బోధనాసుపత్రిలో అత్యాధునిక స్కానింగ్ యంత్రాలను గ్రాంటు రూపంలో పంపిస్తానని వెల్లడించింది. దీని ప్రకారం కర్నూలు, గుంటూరు బోధనాసుపత్రులు, విశాఖ KGHలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదనలు తయారవుతున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ వైద్యులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన వారిలో రాష్ట్రానికి చెందిన పలువురు వైద్యులున్నారు.
సాధారణంగా మృతదేహాల వివరాలను పోలీసులు అందించిన వెంటనే వైద్యులు సమయానికి అందుబాటులో ఉంటే పోస్టుమార్టం నిర్వహణకు కనీసం 3 నుంచి 4 గంటల వరకు సమయం పడుతుంది. పోస్టుమార్టం గదిలోకి మృతదేహం వచ్చిన తర్వాత కత్తితో ఛాతీ, కడుపు, మెడ, పుర్రెను తెరుస్తారు. మృతదేహంపై ఎక్కడ గాయాలున్నా ఈ 4 భాగాల నిశిత పరిశీలన ద్వారా 90శాతం వరకు మరణానికి కారణాలు నిర్ధారణ అవుతాయి. ఈ విధానంలో గుంటూరు, విశాఖ బోధనాసుపత్రుల్లో ఏడాదికి రెండువేలు, మిగిలిన బోధనాసుపత్రుల్లో వెయ్యి నుంచి 15వందల శవపరీక్షలు జరుగుతున్నాయి.
బిడ్డకు జన్మనిచ్చిన 15 ఏళ్ల బాలిక- కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే మృత శిశువు జననం
కత్తి గాటు లేకుండానే పోస్టుమార్టమ్- రాష్ట్రంలోనూ అందుబాటులో డిజిటల్ అటాప్సీ (ETV Bharat) రోగికి సీటీ స్కాన్, ఎమ్మారై తీసే విధానంలానే వర్చువల్ అటాప్సీ ఉంటుంది. సీటీ, ఎమ్మారై, త్రీడీ ఫొటోగ్రామోమెట్రీ కలిసి ఉన్న మిషన్‌లో మృతదేహాన్ని బ్యాగులో పెట్టి పంపిస్తారు. మృతదేహంలోని అవయవాలను అన్ని కోణాల నుంచి నిశితంగా పరిశీలించేందుకు వీలుగా ఇమేజ్ జనరేట్ అవుతుంది. కండరాలు, కాలేయం, మూత్రపిండాలు, ఇతర అవయవాల్లోని సమస్యలను గుర్తిస్తారు. సహజ మరణమా, ప్రమాదమా లేక హత్యా లేక ఇతర ఏదైనా కారణమా అనేది ఇట్టే పసిగట్టేయొచ్చు. కంటికి కనబడని సూక్ష్మ అంశాలను తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇమేజ్‌ల్లో గాయాల ఆధారంగా మరణం ఎలా సంభవించిందన్న దానిపై వైద్యులు నిర్థారణకు వస్తున్నారు.
'ఈ ప్రక్రియ మొత్తం కేవలం అరగంటలోనే పూర్తవడమే కాకుండా ఈ నివేదికలు న్యాయపరంగానూ చెల్లుబాటు కావడం కలిసొచ్చే అంశం. వర్చువల్ అటాప్సీ పారదర్శకత పెంచడమే కాకుండా ఎన్ని సంవత్సరాలైనా ఫిల్మ్‌లు చెదిరిపోకుండా భద్రంగా ఉంటాయి. బాధిత కుటుంబాల సంప్రదాయ విధానాన్ని గౌరవించినట్లవుతుంది. స్విట్జర్లాండ్‌లో తొలుత డిజిటల్ అటాప్సీ అమల్లోకి వచ్చింది. మన దేశంలో దీన్ని విస్తరించేందుకు ఐదేళ్ల నుంచి ICMR చర్యలు తీసుకుంటోంది.'-మహేష్, ఫోరెన్సిక్ వైద్యుడు విజయవాడ జీజీహెచ్
వర్చువల్ అటాప్సీ 80 నుంచి 90శాతం కేసులకు మాత్రమే అనుకూలంగా ఉంది. మిగిలిన కేసులకు సంప్రదాయ కత్తిగాటు విధానం తప్పదు. ముఖ్యంగా పాయిజన్ కేసుల్లో పొట్టభాగంలో కత్తిగాటు పెడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో అనుమానిత ప్రదేశంలో టిష్యూను తొలగించి మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ ద్వారా మరణ కారణాలు ధ్రువీకరిస్తున్నారు. అదనపు పరీక్షల కోసం శరీరంలోని మలం, మూత్రం, ఫ్లూయిడ్స్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాంతం వరకు మాత్రం కత్తిగాటు తప్పదంటున్నారు వైద్యులు.
లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మిస్టరీగా మారిన విద్యార్థిని మృతి- ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు