Vijayawada West Bypass Road :విజయవాడ, రాజధాని ప్రాంతానికి కీలకమైన పశ్చిమ బైపాస్‌లో కొంతభాగం ఏప్రిల్ నెలలోపు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సంక్రాంతి సమయంలో హైదరాబాద్-విజయవాడ హైవేలో వచ్చి ఏలూరు వైపు వెళ్లే వాహనాలను విజయవాడలోకి రాకుండా గొల్లపూడి నుంచి చిన్నఅవుటపల్లి మీదగా మళ్లించారు. తాజాగా గొల్లపూడి నుంచి కృష్ణానది మీదగా రాజధాని వైపు 7 కిలోమీటర్ల మేర రాకపోకలను ఏప్రిల్ నుంచి అనుమతించేందుకు కసరత్తు చేస్తున్నారు.
తద్వారా పశ్చిమ బైపాస్ ద్వారా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి రాజధాని వైపు రాకపోకలు సాగించేందుకు దగ్గరిదారి అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిలో చిన్నఅవుటపల్లి-గొల్లపూడి-కాజ మధ్య విజయవాడ పశ్చిమబైపాస్ నిర్మాణం చేపట్టారు. ఇందులో చిన్నఅవుటపల్లి-గొల్లపూడి మధ్య 30 కిలోమీటర్లు దాదాపు పూర్తయింది. ఇప్పుడు గొల్లపూడి-కాజ ప్యాకేజీలో పాక్షికంగా 7 కిలోమీటర్లు అందుబాటులోకి తేనున్నారు.
Vijayawada Western Bypass Road Works : గొల్లపూడి శివారులో విజయవాడ-హైదరాబాద్ హైవే నుంచి కృష్ణానదిపై వంతెన దాటి వెంకటపాలెం, సీడ్ యాక్సెస్ రోడ్, పాలవాగు మీదుగా కొత్తగా నిర్మించే టోల్‌ప్లాజా దాటాక ఇ-8 (పెనుమాక-కృష్ణాయపాలెం-మందడం) రోడ్‌లో కలిసే వరకు బైపాస్ పనులు పూర్తిచేయనున్నారు. అంటే 3.12 కిలోమీటర్ల మేర వంతెన, మరో 4 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
దీనివల్ల హైదరాబాద్, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి సులువుగా రాజధాని ప్రాంతానికి రాకపోకలు సాగించవచ్చు. ప్రస్తుతం గొల్లపూడి, స్వాతి థియేటర్ సెంటర్, దుర్గమ్మ ఆలయం, ప్రకాశం బ్యారేజి, కరకట్ట మీదగా మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద నుంచి సీడ్ యాక్సెస్ రోడ్‌లోకి రాకపోకలు సాగిస్తున్నారు. ఇకపై నేరుగా గొల్లపూడి నుంచి కృష్ణానదిపై వంతెన మీదుగా ప్రయాణించి ఇ-8 రోడ్‌లోకి చేరుకోవచ్చు. దీనివల్ల దాదాపు 10 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.