Charisma of Vijayawada Won International Medal in Germany Badminton :ఎప్పుడూ హుషారుగా గెంతులు వేస్తుందని బ్యాడ్మింటన్‌లో చేర్పించాడు తండ్రి. తనకు ఉన్న జోష్ అంతా ఆటలో కనపరిచింది ఆ అమ్మాయి. ఎనిమిదేళ్ల వయస్సులో రాకెట్ పట్టిన ఆ చిన్నారి నేడు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనపరిచి కాంస్య పతకాన్ని సాధించి విజయ బావుటా ఎగురవేసింది. పేరుకు తగ్గట్లుగా తన చరిష్మాతో అందరిని మెప్పిస్తుంది విజయవాడ వాసి సూర్య చరిష్మా.
విజయవాడకు చెందిన సూర్య చరిష్మా తండ్రి నవీన్ స్వర్ణకారుడు. రోజూ బ్యాడ్మింటన్ ఆడేందుకు స్టేడియంకు వెళ్తుంటారు. చరిష్మాకు ఉన్న ఉత్సాహం చూసి ఆమెకు ఆట నేర్పించాలని తండ్రి నిర్ణయించుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులో ఆటలో ఆరంగేట్రం చేసిన చరిష్మా కరోనా ముందు వరకు సాధారణ క్రీడాకారిణిగా ఉండేది. కరోనా సమయంలో సైతం శాప్ కోచ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఆన్ లైన్లో కోచింగ్ తీసుకుంది. ఆటలో మెళుకువలు నేర్చుకుంది.
కరోనా అనంతరం నిత్యం కఠోర దీక్షతో సాధన చేసింది. ఈ యేడాది జనవరిలో హైదరాబాద్‌లో జరిగిన అండర్ 19 ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బాడ్మింటన్ టోర్నమెంట్లో బంగారు పతకం సాధించింది. ఈ యేడాది చెన్నైలో జనవరిలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది. గతేడాది డిసెంబర్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పసిడి పతకం సాధించింది.
ఈ యేడాది మార్చిలో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ మహిళల సింగిల్స్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం కైవసం చేసుకుంది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన జూనియర్ జాతీయ స్థాయి పోటీల్లో కాస్యం, గోవాలో జరిగిన జాతీయ పోటీల్లో కాంస్యం గెలుకుని సత్తా చాటింది. ప్రస్తుతం అండర్ 19 విభాగంలో రెండో ర్యాంకు స్థానాన్ని సంపాదించింది చరిష్మా. జర్మనీకి వెళ్లిన బృందంలో మెడల్ సాధించి తన ప్రతిభను చాటింది. దీంతో పాటు రాష్ట్ర స్థాయిలో15 కు పైగా బంగారు పతకాలు సాధించింది. చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ అంటే ఎంతో ఇష్టమని చరిష్మా చెబుతోంది.
'కరోనా సమయంలో చాలా కష్టపడ్డాను. చిన్నప్పటి నుంచి నాకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. అది గమనించిన మా అమ్మానాన్న నన్ను ప్రోత్సహించారు. సరైన సౌకర్యాలు లేకపోయినా ప్రాక్టీస్ ఆపలేదు. జర్మనీలో పతకం సాధించడం చాలా ఆనందంగా ఉంది. కోచ్ భాస్కర్, తల్లిదండ్రుల సహకారం వల్ల ఈ విజయాలు సాధ్యమయ్యాయి.' - సూర్య చరిష్మా ,బ్యాడ్మింటన్ క్రీడాకారిణి