No Basic Facilities For The People in Hilly Area Vijayawada :విజయవాడ కొండ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు . వర్షం కురుస్తుందని హెచ్చరికలు వస్తే వాళ్ల గుండెల్లో గుబులు పుడుతుంది. ఏ పక్క నుంచి ఏ కొండ రాయి తమ ఇంటిపైన పడుతుందోనని భయం భయంతో అక్కడి వారు జీవనం సాగిస్తున్నారు. మాచవరం, మొగల్రాజపురం, గంగిరెద్దుల దిబ్బ కొండ వంటి ప్రాంతాల్లో వర్షం కురిస్తే మట్టి కరిగిపోయి రాళ్లు జారి పడుతున్నాయి.
ఇప్పటికే కబేళా ప్రాంతం, గొల్లపాలెం గట్టు, ఉప్పరబావి, మొగల్రాజపురం ప్రాంతాల్లో నివాసముంటున్న వారి ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు పెరగడం, విపరీతంగా దోమలు ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు. మౌలిక సదుపాయాలు లేక నానా బాధలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాలు అరచేతిలో - కొండచరియల్లో బిక్కు బిక్కుమంటున్న జనాలు - Houses damaged cause landslides
'పిచ్చి మొక్కలు పెరిగి దోమలు ఎక్కువయ్యాయి. కుటుంబమంతా జ్వరాలతో బాధ పడుతున్నాం. అలాంటి సమయంలో కూడా కిందికి వెళ్లలేని పరిస్థితి. లైట్లు ఉండవు, అందుబాటులో ఆస్పత్రి ఉండదు. ఏ అవసరం వచ్చినా కిందికి వెళ్లక తప్పదు. సరైన దారి ఉండదు. వర్షం వస్తే ఇళ్ల నిండా నీరు చేరుతుంది. పెద్ద పెద్ద రాళ్లు పడతాయి. ఇళ్లలో చిన్న పిల్లలు ఉంటారు. ఏ వైపున ఏ ప్రమాదం పొంచి ఉందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం.'-స్థానికులు
Landslide At Andhra Pradesh In Vijayawada People Fear :ప్రస్తుతం వర్షకాలం కావడంతో కొండ చరియలు విరిగి ఇళ్ల మీద పడే ప్రమాదముందని కొండ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఈ తరహా ప్రమాదాలు జరిగాయని గుర్తు చేస్తున్నారు. కబేళా ప్రాంతంలో తరచూ ఇళ్లు కూలి ప్రజలు గాయాల పాలవుతున్నారు. ఆంజనేయస్వామి వాగు ప్రాంతంలో తరచూ రాళ్లు జారి పడుతూనే ఉన్నాయి. టైలర్‌పేట, గొల్లపాలెం గట్టు ప్రాంతంలోనూ రాళ్లు జారి ఇళ్లు కూలడం పరిపాటిగా మారిందని అక్కడి వారు చెబుతున్నారు.
వర్షాల కారణంగా విరిగి పడుతున్న కొండ చరియల మధ్య ప్రమాదకర జీవనం సాగిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రక్షణ గోడలు నిర్మించాలని కోరుతున్నారు.
సమస్యలకు నిలయాలుగా కొండ ప్రాంతాలు- కొత్త ప్రభుత్వానికి విన్నపాలు - Vijayawada hill dwellers problems