Vijayawada CP Kanthi Rana on Eenadu Stories :అధికార వైఎస్సార్సీపీకు బంటుల్లాగా మారిపోయి గత అయిదేళ్లుగా ఆ పార్టీ నాయకులు చెప్పిందే చట్టం, వారి మాటే శాసనమన్నట్లుగా పనిచేస్తున్న కొంతమంది ఐపీఎస్ల తీరుపై కథనాలు రాస్తుంటే ఐపీఎస్ అధికారుల సంఘం దాడి చేస్తోంది. అవి నిరాధార, అసత్య ఆరోపణలంటూ దబాయిస్తోంది. పలువురు ఐపీఎస్ అధికారులపై ఈనాడులో ఇటీవల ప్రచురించిన కథనాలను ఖండిస్తూ ఐపీఎస్ అధికారుల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఛాప్టర్ తరఫున ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ హోదాలో విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో పేర్కొన్న అంశాలు ఆయన ఒక్కరి అభిప్రాయలా లేక సంఘం మొత్తానివా? సంఘం అభిప్రాయాలే అయితే దానిపై కీలకమైన ఆఫీస్ బేరర్ల సంతకాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన వైఎస్సార్సీపీతో అంటకాగే అధికారుల తరఫున వకల్తా పుచ్చుకున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
IPS Officers Behavior in Andhra Pradesh :పలువురు ఐపీఎస్ అధికారులపై నిరాధార, అసత్య ఆరోపణలతో కథనాలు ప్రచురించారని కాంతిరాణా ఆరోపించారు. అసలు ఈనాడు రాసిన ఏ కథనం, ఎలా నిరాధారమో చెప్పకుండానే అవి అసత్య ఆరోపణలని ఆయనెలా నిర్ధారించేస్తారని వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనేమైనా వాటిపై విచారణ జరిపించారా? లేదంటే వైసీపీతో అంటకాగుతున్న కొందరు అధికారుల తరఫున వకల్తా పుచ్చుకున్నారా? అసలు ఏ ప్రాతిపదికన అవి నిరాధారమని తేల్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయిదేళ్ల పాటు వైసీపీ సేవలో తరించింది చాలక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా సరే ఆ పార్టీ పట్ల స్వామి భక్తి వీడకుండా ఏకపక్షంగా పనిచేయటం వల్లే కదా అయిదు జిల్లాల ఎస్పీలు, ఒక ఐజీపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.
వాళ్లు ఏ తప్పూ చేయకుండా, నిష్పక్షపాతంగా ఉండుంటే ఎందుకు ఈసీ ఆగ్రహానికి గురవుతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి అధికారుల గురించి ఉన్నది ఉన్నట్లు రాస్తే అది అసత్యం ఎలా అవుతుంది? చివరికి బదిలీ అయిన అధికారుల స్థానంలో నియమితులైన నెల్లూరు, ప్రకాశం, అనంతపురం ఎస్పీలు ఆరిఫ్ హఫీజ్, గరుడ్ సుమిత్ సునీల్, అమిత్ బర్దర్లు గతంలో వాళ్లు పనిచేసిన జిల్లాల్లో అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాయటం వాస్తవం కాదా అనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలను అణచివేయటం నిజం కాదా? వాళ్లు వైసీపీ పీనల్ కోడ్ను ఎంత బాగా అమలు చేశారో ఘటనలతో సహా రాసింది. అవి నిజం కాదని చెప్పగలిగే ధైర్యం కాంతి రాణాకు ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పోలీసు నాయకత్వాన్ని ఆత్మరక్షణలో నెట్టేయటానికి, చట్టబద్ధమైన విధుల నిర్వహణలో నిష్క్రియాత్మకంగా మార్చేయాలన్న లక్ష్యంతో అవమానకరమైన ఆరోపణలతో కథనాలు రాస్తున్నారని కాంతి రాణా అన్నారు. కొంతమంది ఐపీఎస్లు తాము అఖిలభారత సర్వీసు అధికారులమని కూడా మరిచిపోయి అయిదేళ్లుగా వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పేట్రేగిపోతుంటే అది మీకెప్పుడు అవమానకరంగా అనిపించలేదా? కనిపించలేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వైసీపీ పీనల్ కోడ్, సీఆర్పీసీ బదులు వైసీపీ ప్రొసీజర్ కోడ్ అమలు చేస్తున్నప్పుడు అసలు చట్టాలేంటో గుర్తుకు రాలేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి భజన చేయటం ప్రతిపక్షాలను తొక్కేయటమే లక్ష్యమన్నట్లు పనిచేసి పోలీసుల ఆత్మగౌరవాన్ని, ప్రతిష్ఠను జగన్ కాళ్ల దగ్గర ఎప్పుడో తాకట్టు పెట్టేసిన కొందరి నుంచి చట్టబద్ధమైన విధుల నిర్వహణ అనే మాటలు రావటం హాస్యాస్పదంగా అనిపిస్తోందనే వాదనలు వినిపిస్తాయి.