VIJAYAWADA BOOK FESTIVAL 2025: తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలే అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందని, రూ.కోటి ఇవ్వడానికి ఆలోచించను గానీ పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పుస్తక మహోత్సవాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చెరుకూరి రామోజీరావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
పుస్తక పఠనం లేకపోతే ఏమయ్యేవాడినో:పుస్తకం ఇవ్వాలంటే తన సంపద ఇచ్చినంత మదనపడతానని పవన్ కల్యాణ్ అన్నారు. కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా గానీ తన వద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వనని చెప్పారు. పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తుందని, తాను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదని వ్యాఖ్యానించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి నేర్చుకున్నారని అన్నారు. ఠాగూర్ ప్రేరణతో ఇంట్లో పూలమొక్కలు చూస్తూ పుస్తకాలు చదివానని చెప్పారు.