Venkatayapalem Shiromundanam Case :వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దళితుల శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ, మండపేట వైకాపా అభ్యర్థిగా తోట త్రిమూర్తులను దోషిగా కోర్టు తేల్చింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్షతో పాటు రెండున్నర లక్షల జరిమానా విధించింది. శిరోముండనం కేసులో 28 ఏళ్ల తర్వాత విశాఖ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులోమొత్తం 10 మంది నిందితులకు 18నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. న్యాయస్థానం తీర్పును దళిత, ప్రజాసంఘాలు స్వాగతిస్తున్నాయి. 28 ఏళ్లుగా పోరాడుతున్న తమకు కోర్టు న్యాయం చేసిందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెలో 1996 డిసెంబర్ 29న శిరోముండనం కేసు వెలుగుచూసింది. బాధితులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నం, కనికెళ్ల గణపతి, చల్లపూడి పట్టాభి రామయ్య, పువ్వల వెంకటరమణ అమ్మాయిల పట్ల ఈవ్ టీజింగ్‌కు పాల్పడినట్టు నంది బొమ్మ వద్ద అసభ్యకరంగా రాతలు రాశారని ప్రధాన ఆరోపణలు. వీరిలో నలుగురిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులు జైలుకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత స్థానిక స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు వెంకటాయపాలెంలోని ఇంటి వద్ద తోట బాబులు, తోట రాము, తోట పుండరీకాక్షలు, తోట బాబి, తలాటం మురళీ మోహన్, దేవళ్ల కిశోర్, తోట శ్రీను, మంచం ప్రకాష్, ఆచంట రామసత్యనారాయణలతో కలిసి బాధితుల్లో ఇద్దరికి శిరోముండనం చేయింటినట్టు, కనుబొమ్మలు తీయించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితుల్ని చిత్రహింసలకు గురి చేశారని ప్రధాన ఆరోపణలు. ఈ వ్యవహారంపై ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
తోట త్రిమూర్తులును పదవి నుంచి తప్పించాలని.. కలెక్టరేట్ ముట్టడి
ఈ ఘటనపై ప్రజా, మానవ హక్కులు, పౌర సంఘాలతోపాటు వెంకటాయపాలెంకు చెందిన దళిత ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో పోరాటాలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాయి. ఫ్రధాన నిందితుడు తోట త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి 87 రోజులపాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉంచారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఘటనపై జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ వేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులకు క్లీన్ చిట్ ఇస్తూ జీవో ఇచ్చింది. ఈ జీవోను సవాల్ చేస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తుల్ని విచారించాలని హైకోర్టు ఆదేశించింది. 2008లో శిరోముండనం కేసులో తిరిగి విచారణ చేపట్టారు. 2015 జనవరిలో సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం ఆధ్వర్యంలో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. శిరోముండనం కేసును త్వరగా తేల్చి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశానుసారం 2017 నుంచి విశాఖలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది.