Vasireddy Padma Letter To National Women Commission :సోషల్ మీడియాలో మహిళల పట్ల సాగుతున్న వికృత దాడిపై కఠిన చట్టం కోసం సుప్రీంకోర్టులో పిల్ వేయాలని మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్‌కు ఆమె లేఖ రాశారు. సీఎం, డిప్యుటీ సీఎంతోపాటు వారి కుటుంబసభ్యులు, హోంమంత్రి, మహిళా నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. పసలేని చట్టాలతో ఈ సైకోల దాడి నుంచి మహిళలను కాపాడలేమన్నారు. సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను రివ్యూ చేయాలని లేఖలో పేర్కొన్నారు. తక్షణమే సుప్రీంకోర్టులో పిల్ వేసి కఠినమైన చట్టం తీసుకువచ్చేలా చూడాలన్నారు.
తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం వేదికగా వైఎస్సార్సీపీ ఏకంగా ఓ సైబర్ టెర్రరిస్ట్‌ల ఫ్యాక్టరీని నడిపిస్తోంది. ఒకరో ఇద్దరో కాదు రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకూ దాదాపు 50వేల మంది సైబర్ ఉగ్రవాదుల్ని తయారు చేసి నిత్యం రేచుకుక్కలు, రాబందుల మాదిరిగా వారిని ఉసిగొల్పుతోంది. ఈ వైఎస్సార్సీపీ ఉగ్రవాదులకు తల్లి, చెల్లి, అక్క అనే ఉచ్ఛనీచాలుండవు. పాము తన పిల్లల్ని తానే తిన్నట్లుగా వారి పార్టీ అధ్యక్షుడు జగన్‌కు, వారి పార్టీకి ఎదురు తిరిగితే చాలు అది షర్మిల అయినా, విజయమ్మ అయినా కూడా చూడకుండా అసభ్య పోస్టులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత సహా కూటమిలోని ముఖ్య నాయకులు, వారి కుటుంబాల్లోని మహిళలు, చిన్నపిల్లలే లక్ష్యంగా ఈ ఉన్మాదమూక సామాజిక మాధ్యమాల్లో అత్యంత దారుణమైన పోస్టులు, మార్ఫింగ్, ఎడిటింగ్ చిత్రాలు, వీడియోలు పెడుతున్నారు.