Tirupati Laddu Ghee Issue :తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంపై రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పందించారు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి పూర్తి నివేదికను కోరినట్లు నడ్డా తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ఇదే అంశంపై కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన అంశం చాలా తీవ్రమైనదన్నారు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని చెప్పారు. లడ్డూ కల్తీ వ్యవహారం అందరినీ ఆందోళనకు గురి చేసే అంశమని ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినదని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
ఈ అంశంపై కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ట్వీట్ చేశారు. తిరుమల కాలేజీల్లో శ్రీవారి ఫొటోలు తొలగించాలని జగన్ అండ్ కో చూసిందని ఆమె ఆరోపించారు. హిందూయేతర గుర్తులు సప్తగిరులపై ఏర్పాటు చేయాలని చూశారని విమర్శించారు. హిందువులు కానివారిని బోర్డ్ ఛైర్మన్‌గా నియమించారని ఆక్షేపించారు. జంతువుల కొవ్వులను పవిత్ర ప్రసాదంలో కలిపారని దుయ్యబట్టారు. స్వామీ ఈ హిందూ వ్యతిరేక రాజకీయాలకు మమ్ము క్షమించు అని శోభా కరంద్లాజే వ్యాఖ్యానించారు.