DEAD BODY FOUND IN PARCEL: ఆన్లైన్లో ఏదైనా వస్తువు బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ చేయడం సర్వసాధారణం. అయితే ఎలాంటి బుకింగ్ చేయకుండానే డెడ్ బాడీ పార్సిల్ వస్తుందని ఊహించగలమా ? కానీ పశ్చిమగోదావరి జిల్లాలో అదే జరిగింది. ఓ మహిళ ఇంటికి మృతదేహాన్ని చెక్కపెట్టెలో పార్శిల్ పంపించడం, కోటి 35 లక్షల రూపాయలు చెల్లించకపోతే నీకూ ఇదే గతి పడుతుందని బెదిరించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి ఇంటికి గురువారం రాత్రి వచ్చిన ఓ పార్శిల్ అలజడి సృష్టించింది. గత రాత్రి ఆటోలో వచ్చిన చెక్కపెట్టె పార్శిల్‌ను తులసి తీసుకున్నారు. కష్టాల్లో ఉన్న తనకు సాయం చేస్తామన్న క్షత్రియ సేవాసమితి నుంచి ఎలక్ట్రికల్ వస్తువులు వచ్చి ఉంటాయని ఆమె భావించారు. కొద్దిసేపటి తర్వాత పార్శిల్ తెరిచి చూశారు. అందులో ఉన్నది చూసి షాక్ కు గురయ్యారు. ఎందుకంటే ఆ చెక్కపెట్టెలో ఉన్నది ఫ్రిజ్ లేదా వాషింగ్ మెషిన్ లాంటి ఎలక్ట్రికల్ వస్తువు కాదు. అదో మృతదేహం. అది కూడా పూర్తిగా ఉబ్బిపోయి, తీవ్రమైన దుర్వాసన వస్తోంది. దాన్ని చూడగానే కంగుతిన్న తులసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పార్శిల్‌తో పాటు బెదిరింపు లేఖ:ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగిన పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. పార్శిల్ వచ్చిన మృతదేహాన్ని పరిశీలించారు. తులసి నుంచి వివరాలు సేకరించారు. అలాగే పార్శిల్‌తో పాటు కోటి 30లక్షల రూపాయలు చెల్లించాలని లేదంటే ఇబ్బందుల్లో పడతారంటూ వచ్చిన హెచ్చరిక లేఖను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పార్శిల్ మృతదేహం కథ వెనక కుట్రను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్పీ అస్మీ చెప్పారు.
యండగండి గ్రామానికి చెందిన ముదునూరు రంగరాజు కుమార్తె సాగి తులసి అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. పదేళ్ల క్రితం ఇంటినుంచి భర్త వెళ్లిపోవడంతో కొన్నేళ్లపాటు తల్లిదండ్రుల వద్దే ఉన్నారు. తన సోదరికి పెళ్లయ్యాక అద్దె ఇంట్లోకి మారారు. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇటీవల సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. తన ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున సాయం కోసం క్షత్రియ సేవాసమితిని ఆశ్రయించారు. ఇటీవలే వాళ్లు ఇంటి నిర్మాణ సామగ్రి పంపించారు. రెండో విడతలో ఎలక్ట్రికల్ వస్తువులు పంపుతామని మాటిచ్చారు. తీరా వచ్చిన పార్శిల్ చూస్తే మృతదేహాం ఉండటంతో తులసి విస్తుపోయారు.
దుర్వాసన వస్తోందని స్థానికుల ఫిర్యాదు- ఇంట్లో చూస్తే షాక్!