Sons in Law Protest at Eluru Collectorate: ఏలూరు కలెక్టరేట్ వద్ద ఒక విచిత్రమైన నిరాహార దీక్ష చోటుచేసుకుంది. మామకు వ్యతిరేకంగా ఇద్దరు అల్లుళ్లు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. టెంట్ వేసి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని మరీ నిరసన కొనసాగిస్తున్నారు. తమ మామ శాడిజం భరించలేకే మరో దారి లేక రోడ్డెక్కామని వారు చెప్తున్నారు.
చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. అత్తారింట్లో భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఓ తండ్రి మాత్రం తమ కుమార్తెలను ఇంట్లోనే ఉంచుకున్నారు. దీంతో మామకు వ్యతిరేకంగా అల్లుళ్లు నిరసన మొదలు పెట్టారు. తమ భార్యలను కాపురానికి పంపకుండా అడ్డుపడుతున్న మామపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఇద్దరు అల్లుళ్లు రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు.
ఏలూరుకు చెందిన అయ్యంగార్ అనే వ్యక్తి తన పెద్ద కుమార్తెను 2015లో గుజరాత్లో ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్న పవన్‌కు, 2024 సంవత్సరంలో విజయవాడలో యానిమేషన్ ఉద్యోగం చేస్తున్న శేషసాయికి చిన్న కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. పెద్ద కుమార్తెకు బిడ్డ పుట్టిన సంవత్సరం నుంచి ఆమెను కాపురానికి పంపించడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా పెళ్లైన కొద్ది నెలలకే తన భార్యను కాపురానికి పంపించడం లేదని చిన్నల్లుడు శేషసాయి వాపోతున్నారు.