Tungabhadra Dam Gate Repair Works:తుంగభద్ర జలాశయంపై విరిగిన గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. నీటి సంరక్షణే ధ్యేయంగా వీలైనంత త్వరగా స్టాప్ లాగ్ గేట్ అమర్చేందుకు అధికారులు అహరహం శ్రమిస్తున్నారు. అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియ నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రయత్నం సఫలమైతే ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచిపోనుంది.
తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన 19 నెంబర్ గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు అమర్చడం సవాల్‌గా మారింది. సహజంగా నీరంతా వెళ్లిపోయాక కొత్తగా గేటు ఏర్పాటు చేస్తారు. అలా చేస్తే 60 టీఎంసీల నీరు వృథాగా పోతుంది. ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు 28 టీఎంసీల నీరు వృథాగా వదిలేయాల్సి వచ్చింది. డ్యాంలో నీటిమట్టం అడుగంటితే ఇప్పటికే పైర్లు వేసి పెట్టుబడులు పెట్టిన ఆయకట్టు రైతులు వేల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించిన ఇరు రాష్ట్రాల అధికారులు సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు.
తుంగభద్ర డ్యాంను పరిశీలించనున్న కర్ణాటక సీఎం, ఏపీ మంత్రులు - నీటి వృథా అరికట్టేలా స్టాప్‌లాగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు - Tungabhadra Dam Repair Works
నీటిని పూర్తిగా కిందకు వదిలేయకుండా స్టాప్‌లాగ్ గేటు అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం ప్రక్రియను జలాశయాల గేట్ల నిపుణులు కన్నయ్యనాయుడు పర్యవేక్షిస్తున్నారు. స్టాప్ లాగ్ గేటు కోసం ఐదు ముక్కలు సిద్ధం చేయిస్తున్నారు. ఇందులో మూడు ముక్కల తయారీని జిందాల్ సంస్థ ఇప్పటికే ప్రారంభించింది. మిగతా రెండు ముక్కల్ని నారాయణ, హిందుస్థాన్ సంస్థలు తయారు చేయనున్నాయి. వీటన్నింటినీ అతుకు పెట్టనున్నారు.
సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రక్రియ ఇంజనీరింగ్ సాహసమని, మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. తుంగభద్ర డ్యాం సంరక్షణకు ఇరురాష్ట్రాల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. నీటి వృథాను అరికట్టడమే తక్షణ కర్తవ్యమని డ్యాంను పరిశీలించిన తర్వాత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
"తుంగభద్ర డ్యాం వద్ద విరిగిపోయిన గేటు స్థానంలో స్టాప్ లాగ్ అమర్చేందుకు ఏర్పాట్లు ప్రారంభించాం. ఇందుకోసం ఐదు ముక్కలు సిద్ధం చేయిస్తున్నాం. ఇందులో మూడు ముక్కల తయారీని జిందాల్ సంస్థకు, మిగతా రెండు ముక్కల్ని నారాయణ, హిందుస్థాన్ సంస్థలకు అప్పగించాం. వీటన్నింటినీ అతుకుపెట్టేందుకు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది." - నిమ్మల రామానాయుడు, జల వనరుల శాఖ మంత్రి
తుంగభద్ర ప్రాజెక్టు స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటుకు చర్యలు- పర్యవేక్షిస్తున్న మంత్రులు, నిపుణులు - tungabhadra dam gate repair work