POND MISSING COMPLAINT IN TELANGANA: మన విలువైన వస్తువులు పోయినా, ఎవరైనా కనిపించకపోయినా, ఏదైనా కష్టం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ తెలంగాణలో మాత్రం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. చెరువుజాడ కనిపెట్టండి సారూ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఆవేదనని వారి ముందు వెలిబుచ్చారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయామని, మీరే మాకు న్యాయం చేయాలంటూ ఖాకీలను వేడుకున్నారు.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగూలో 8 ఎకరాల్లో తుమ్మల చెరువు ఉండేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం చెరువు కనిపించకుండా పోవడం వలన వర్షం వస్తే తమ పంటలు మునిగిపోతున్నాయని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. మీరే మాకు న్యాయం చేయాలని, చెరువుని వెతికిపెట్టాలని పోలీసులని కోరారు.
చెరువుని దొంగిలించింది ఎవరు:ఈ మేరకు చెరువు జాడ కనిపించట్లేదని రంగారెడ్డి జిల్లాలోని పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తుక్కుగూలో 8 ఎకరాల్లో ఉండాల్సిన తుమ్మల చెరువును కొందరు కబ్జా చేసి వెంచర్లు వేశారని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనివల్ల ప్రతి వర్షాకాలంలో పంటలు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించి చెరువు ఆచూకీ కనిపెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెరువు కబ్జాపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయామని వాపోయారు. పోలీసులైనా చెరువు ఆచూకీ వెతికిపెట్టాలని కోరారు.