TTD EO Shyamala Rao About Private Guest House Designs in Tirumala :తిరుమలలో నిర్మించిన ప్రైవేటు అతిథి గృహాల ఆకృతుల్లో ఆధ్యాత్మికత లోపించిందని తమకు నచ్చిన రీతిలో పేర్లు ఏర్పాటు చేసుకున్నారని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమలలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆకర్షణీయ పట్టణ నిర్మాణం లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించనున్నట్లు ఈవో తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మల్టీలెవల్ స్మార్ట్ పార్కింగ్, పుట్ పాత్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని శ్యామలరావు స్పష్టం చేశారు.
తిరుమల క్షేత్రాన్ని వచ్చే 25 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అడుగులు వేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుమలతో పాటు తిరుపతిలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కట్టడాలు నిర్మిస్తామని భక్తుల రద్దీకి అనుగుణంగా అలిపిరిలో వసతి ఏర్పాట్లను మెరుగుపరుస్తామని వెల్లడించారు.
టీటీడీలో మార్పులకు శ్రీకారం - తిరుపతి వాసులకు దర్శన కోటా పునరుద్ధరణ
బాలాజీ బస్టాండును మరో ప్రాంతానికి తరలించి, దాన్ని యాత్రికుల వసతి సౌకర్యాలకు వినియోగించుకోవాలని యోచిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో కొన్ని పాత కట్టడాల స్థానంలో నూతన నిర్మాణాలు చేపడతామన్నారు. గతంలో దాతలు నిర్మించిన భవనాలు, కాటేజీలకు 150 చారిత్రక, పురాణ, ఇతిహాసాల్లోని పేర్లు పెట్టాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయించామని వెల్లడించారు. తిరుమలలో వాహనాల రద్దీకి అనుగుణంగా పార్కింగు స్థలాలు, యాత్రికులకు అవసరమైన ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
అన్యమతస్తులు 31 మంది..
పాలకమండలి నిర్ణయం మేరకు ఓ విశ్రాంత ఉన్నతాధికారిని ప్లానింగ్ విభాగంలోకి తీసుకున్నామని, టీటీడీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి నూతన నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. అలిపిరి సమీపంలో దేవలోక్ సంస్థకు కేటాయించిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలనే అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. టీటీడీ పరిధిలో 31 నుంచి 36 మంది అన్యమతస్థులు ఉన్నట్లుగా నివేదికలు అందాయని, వారంతా ఆలయ విధుల్లో లేరని చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే న్యాయస్థానంలో రెండు కేసులు నడుస్తున్నాయని వివరించారు.
దళారులపై నిఘా- టికెట్లు, గదుల విషయంలో వారి జోక్యం కుదరదు