Tribal Welfare Ashram Hostels With Lack of Facilities:ఐటీడీఏ పరిధిలోని పలు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం భద్రత కల్పించడంలో అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అధ్వాన పరిస్థితులు నెలకొంటున్నాయి. పిల్లలకు కుళ్లిన కూరగాయలు ఆహార పదార్థాలతో భోజనం అందిస్తున్నారు. గుడ్లు, మాంసం, వంట నూనెలు, చింతపండు, కారం, పసుపు, కూరగాయలు సహా సరుకులు సరఫరా చేస్తున్న గుత్తేదారు నాణ్యత లేనివి ఇచ్చినా అడిగే వారే లేరు.
ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహాల్లో నీటి కష్టాలు - విద్యార్థులు, వైద్యుల పాట్లు
పాఠశాలలో మొత్తం 320 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి అక్కడ వసతి చాలడం లేదు ఇరుకు గదుల్లో కిక్కిరిసి ఉంటున్నారు. తగిన సిబ్బంది లేక గదులు శుభ్రం చేయడం లేదు. దోమలు బెడద ఎక్కువగా ఉంది. మరుగుదొడ్లు సరిపడా లేవు ఉన్నవి దారుణంగా ఉన్నాయి. పాఠశాలలలో రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ వార్డెన్గా నవీన్ బాబు రెండేళ్లుగా కొనసాగుతున్నారు. రొటేషన్ పద్దతి అమలు కావడం లేదు. ఇందుకు అధికార పార్టీ నాయకుల మద్దతేనని ఆరోపణలు ఉన్నాయి. నవీన్ బాబు భార్య జీలుగుమిల్లి ఎంపీపీగా ఉన్నారు. ఇదిలా ఉండగా వసతి గృహంలో పాడైన కూరగాయలు వండి విద్యార్థులకు పెడుతున్నారని, కనీస శుభ్రత పాటించడం లేదని మరుగుదొడ్ల పరిస్థితి మరి అధ్వానంగా ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.