Tractor purchases on the rise :రాష్ట్రంలో ట్రాక్టర్ల కొనుగోళ్లు వేగం పుంజుకుంటున్నాయి. 2023 అక్టోబర్ తో పోలిస్తే ఈ సంవత్సరం అక్టోబర్ లో మరింత ఎక్కువ సంఖ్యలో విక్రయాలు జరిగినట్లు డీలర్లు చెబుతున్నారు. దీని ప్రకారం మునుపటితో పోలిస్తే వాహన రంగ వృద్ధి ఆశాజనకంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
జోరుమీదున్న వాహన కొనుగోళ్లు, అమ్మకాలు:రాష్ట్రంలో పంట ఉత్పత్తుల రవాణా మొదలు కావడంతో పాటు, ఇసుక రవాణాకు ట్రాక్టర్లను అనుమతించడం, దీనికి ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ కంపెనీలకు చెందిన 7,548 ట్రాక్టర్లను గత నెలలో విక్రయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ లోనే 3,797 అమ్ముడుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 2023 అక్టోబరులో 2,830 ట్రాక్టర్ల రిజర్వేషన్ జరగగా ఈ ఏడాది అక్టోబర్ లో 3,330 వరకు జరిగినట్లు రవాణాశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ట్రాక్టర్ దానికి అనుసంధానంగా ఉండే ట్రక్కు కలిపి సగటున రూ. 10 లక్షల వరకు ఉంటుంది.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూలంగా లేదు. పంట ఉత్పత్తులు సైతం తగ్గిన పరిస్థితి నెలకొంది. ఇసుక రవాణాపై వైఎస్సార్సీపీ నేతల గుత్తాధిపత్యం కారణంగా సామాన్యులు అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. దీనితో ట్రాక్టర్ల అమ్మకాలు పూర్తిగా మందగించాయి. పాత ట్రాక్టర్లను ఇచ్చి ఈఎంఐ విధానంలో చెల్లించి కొత్తవి తీసుకెళ్లవచ్చని డీలర్లు ఆఫర్లు చూపించినా రైతులు దానిపై మొగ్గు చూపలేదు. అయితే ఈ ఏడాది వ్యవసాయం సానుకూలంగా ఉండటంతో పాటు ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణాకు అనుమతించింది. వీటితో పాటు వాహన కొనుగోళ్లలో కొన్ని రకాల రాయితీలను సైతం కల్పించే ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారా చేయనుంది. దీని వలన మరిన్ని కొనుగోళ్లు పెరిగినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.