Tollywood Josh with NDA Win: కూటమి గెలుపుతో తెలుగు చిత్రసీమలో జోష్ వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సినిమా రంగానికి ఏ దశలోనూ ప్రోత్సాహం లభించలేదు. వేడుకలు, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు మొదలుకొని టికెట్ ధరల వరకూ ప్రతి విషయంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేచీలు పెట్టేది. సర్వం తానే అయి, ఎవరైనా తన వద్దకొచ్చి ప్రాధేయపడాల్సిందే అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించారు. దీంతో కళారంగానికి, చిత్రసీమకు తాము బద్ధ వ్యతిరేకమని చెప్పకనే చెప్పినట్టయింది. అదే చిత్రసీమ మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చింది.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ హృదయంతో సమానం. 60 శాతానికిపైగా సినీ వ్యాపారం జరిగేది ఇక్కడే. తనకు రాజకీయ ప్రత్యర్థులైన పవన్‌కల్యాణ్, బాలకృష్ణను దెబ్బ కొట్టడానికి పలుమార్లు ఇదే అస్త్రంగా జగన్ ఎంచుకున్నారు. వాళ్లు నటించిన సినిమాలనే లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారు. అయినా వెనకడుగు వేయకుండా నిర్మాతలకు అండగా నిలుస్తూ ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరోవైపు ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్, బాలకృష్ణ పోరాడారు.
చంద్రబాబును పొగిడారని:చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని రజనీకాంత్ అన్నందుకు అప్పటి మంత్రులతో వైఎస్సార్సీపీ నాయకత్వం తిట్టించింది. రజనీ వయసు, స్థాయినీ మరిచిపోయి ఆయన్ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని కొడాలి నాని, రోజా నానా మాటలన్నారు. ఆ నోటి దురుసు ఎఫెక్ట్ ఉంటుందో అర్థమైందా అంటూ ఈ ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెప్పారు. ఇలాంటి సినీ వ్యతిరేక విధానాలను చిత్రసీమ, సినీ ప్రేమికులు, అభిమానులు గమనిస్తూనే వచ్చారు. ఎన్నికల్లో వారు చేయాల్సిన పనిని చేసి చూపించారు.
అగ్ర కథానాయకులు పవన్‌కల్యాణ్, బాలకృష్ణ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడంతోపాటు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. వారిద్దరూ ఘన విజయాలు సొంతం చేసుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. వాళ్లిద్దరూ సాధించిన ఘనతలను, ప్రసంగాల వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. నిర్మాణ సంస్థల కార్యాలయాలు, సినిమాల సెట్స్‌లోనూ సంబరాలు చేసుకున్నారు. పలువురు సినీ తారలు, ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలకు శుభాకాంక్షలు చెప్పారు.