ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోవిందా అపచారం అపచారం - తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం దుర్మార్గమే! - Tirumala Laddu Issue Updates

Tirumala Laddu Issue Updates: పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలవటం ఘోర అపచారమనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. కిలో నెయ్యి కేవలం రూ.320కే కొనుగోలు చేసేలా గుత్తేదారుడితో ఒప్పందం చేసుకోవడమేగాక తూతూ మంత్రంగానే తిరుమల ల్యాబ్‌లో నాణ్యత పరీక్షలు నిర్వహించారు. దీంతో తిరుమలలోని ల్యాబ్‌లో నాణ్యతా పరీక్షలు సరిగా జరగడంలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ ధరను రెట్టింపు చేసి నాణ్యతకు తిలోదకాలిచ్చారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్లుగా సరఫరా చేస్తున్న కర్ణాటక నందిని నెయ్యిని పక్కనపెట్టి కల్తీ నెయ్యిని కొనుగోలు చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Tirumala Laddu Issue Updates
Tirumala Laddu Issue Updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2024, 7:27 AM IST

Tirupati Laddu Ghee Controversy :కలియుగ వైకుంఠ వాసుడు కొలువైన తిరుమల కొండ హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. తెలుగు రాష్ట్రాల నుంచే గాక, దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకుంటారు. తిరుమలేశుడిని ఎంత భక్తిభావంతో కొలుస్తారో స్వామివారి ప్రసాదం లడ్డూను అంతే పవిత్రంగా చూస్తారు. దానిని అమృతంతో సమానంగా భావించే భక్తులు తిరుమల నుంచి రాగానే ఆ ప్రసాదాన్ని బంధువులు, మిత్రులకు పంచుకుంటారు. తిరుపతి వెళ్తున్నామని చెబితే చాలు మాకూ ఓ లడ్డూ పట్టుకు వస్తారా అంటూ తెలిసినవాళ్లు అడగడం పరిపాటి.

తిరుమల లడ్డూకు ఉండే రుచి, వాసన మరెక్కడా మనకు కనిపించదు. ఘుమఘుమలాడే నేతి సౌరభాల్ని వెదజల్లుతూ నోటిలో వేసుకుంటే కరిగిపోతూ అత్యంత రుచికరంగా ఉంటుంది. లడ్డూను పట్టుకుంటేనే చేయి మొత్తం కమ్మగా నేతి వాసన వచ్చేది. కానీ గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తిరుమలలో అనేక అపచారాలు చోటుచేసుకున్నాయి. నాటి పాలకుల అవినీతి కొండపైకీ చేరింది. దీంతో భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూపైనా అనేక ఫిర్యాదులు వచ్చాయి.

పట్టించుకోని టీటీడీ గత పాలకులు : లడ్డూ నాణ్యత లోపించిందని, రుచి, వాసన బాగుండటం లేదని, రెండురోజులకే ప్రసాదం చెడిపోతుందనే విమర్శలు వచ్చాయి. కానీ ఇవేమీ నాటి పెద్దలు గానీ టీటీడీ అధికారులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ఆ ప్రసాదాలకు వినియోగిస్తున్న నెయ్యి కల్తీది అని వారికి తెలుసు కాబట్టే కిమ్మనలేదన్న వాదన వినిపిస్తోంది. ఈ నేతిలో వనస్పతి, వృక్ష, జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని బయటపడటంతో భక్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని నివేదిక బట్టబయలు కావడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలు నానా తంటాలు పడ్డారు. టీటీడీ మాజీ ఛైర్మన్‌, జగన్ బాబాయి వైవీ.సుబ్బారెడ్డి తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. శ్రీవారికి నివేదించే ప్రసాదాల తయారీకి రాజస్థాన్‌లోని ఫతేపూర్ నుంచి రోజుకు 60 కిలోల చొప్పున శుద్ధమైన దేశీ ఆవు నెయ్యిని దాతల సహకారంతో కొన్నామని వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. దీనికి రోజుకు లక్ష ఖర్చు అవుతుందన్నారు. అంటే కిలో నెయ్యి ధర రూ.1667లకు కొనుగోలు చేశామని ఆయనే స్వయంగా చెప్పారు. అలాంటప్పుడు లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కేవలం రూ.320 రూపాయలకే ఎలా వచ్చిందో వైవీ.సుబ్బారెడ్డి చెప్పాలి.

కిలో నెయ్యి రూ.320కి సరఫరా : కిలో ఆవు నెయ్యి కావాలంటే సుమారు 17 నుంచి 18 లీటర్ల పాలు అవసరం. అంటే కేవలం పాలకోసమే దాదాపు రూ.700లకు పైగా ఖర్చవుతున్నప్పుడు కిలో నెయ్యి రూ.320లకే గుత్తేదారుడు ఎలా సరఫరా చేస్తాడు? పైగా యూపీ,దిల్లీ వంటి ప్రాంతాల్లో సేకరించి సరఫరా చేయాలంటే గుత్తేదారుడు రవాణా ఖర్చులు కూడా భరించి అంత తక్కువ ధరకు సరఫరా చేయలేడన్న విషయం సాధారణ ప్రజలకు కూడా తెలుసు. మరి అప్పటి టీటీడీ పాలకమండలి సభ్యులకు ఈ మాత్రం తెలివి లేదా అని భక్తులు నిలదీస్తున్నారు.

Animal Fat In Tirumala Laddu : దాదాపు ఐదు దశాబ్దాలుగా తిరుమలకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌ నెయ్యి సరఫరా చేస్తోంది. అది కర్ణాటక ప్రభుత్వరంగ సంస్థ. నెయ్యి సరఫరాకు ఎక్కువ ధర కోడ్‌ చేసిందంటూ జగన్ సర్కార్‌ ఈ సంస్థను పక్కన పెట్టేసింది. అయితే అంతకన్నా తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయడం సాధ్యం కాదని అప్పట్లోనే కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్ సంస్థ అధ్యక్షుడు చెప్పారు. అయినా టీటీడీ గత పాలకులు పట్టించుకోలేదు. తక్కువ ధరకే కొంటున్నామంటూ బీరాలు పలికి కల్తీ నేతిని కొనుగోలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. 50 ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థను కాదని కొత్త గుత్తేదారుడికి ఆ బాధ్యతలు అప్పగించడం వెనక మర్మమేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తిరుమలలో శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదాల కోసం టీటీడీ సుమారు 48 రకాల సరుకులు కొనుగోలు చేస్తుంది. నెయ్యి సహా ఆ పదార్థాలన్నీ తిరుపతిలోని గోడౌన్‌లో భద్రపరుస్తారు. వాటి నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌ను మాత్రం తిరుమల కొండపై ఏర్పాటు చేశారు. నమూనాల్ని తీసుకెళ్లి అక్కడ పరీక్షిస్తుంటారు. కానీ ఆ పరీక్షలు తూతూమంత్రంగా జరుగుతాయి. టీటీడీకి ప్రతిరోజూ పది నెయ్యి ట్యాంకర్లు వస్తాయి. ఒక్కో ట్యాంకులో సుమారు 12,000ల లీటర్ల నెయ్యి ఉంటుంది. వీటిల్లో కొన్ని ట్యాంకర్ల నుంచి నమూనాలు తీసుకుని వెళ్లి ల్యాబ్‌లో పరీక్షిస్తారు. వాటిలో ఎలాంటి కల్తీ జరిగిందో నిగ్గుతేల్చే అధునాతన పరికరాలు అందులో లేవు.

రెండోసారి తీసుకొచ్చిన నెయ్యి బాగానే ఉందని నిర్థరణ : అయితే వచ్చిన ప్రతి ట్యాంకర్ నెయ్యి బాగుందని నిర్థరిస్తే భవిష్యత్‌లో ఇబ్బంది ఎదురవుతుందని గ్రహించి కొన్నింటిని తిప్పి పంపుతారు. ఆ ట్యాంకర్లు తిరుపతి బైపాస్‌ రోడ్డులోకి వెళ్లి వేరే నంబర్ ట్యాంకర్లలోకి ఆ నెయ్యిని నింపి మళ్లీ తీసుకొస్తారని సమాచారం. అంతకు ముందు నాణ్యత లేదని చెప్పిన ఆ నెయ్యినే మళ్లీ బాగుందని ల్యాబ్‌లో నిర్థారిస్తారన్నది అక్కడ పనిచేస్తున్నవారి మాట. సరుకుల నాణ్యత పరీక్షించే ల్యాబ్‌ ఇంతకు ముందు టీటీడీ వైద్యాధికారి నియంత్రణలో ఉండేది. కానీ ధర్మారెడ్డి ఈవోగా వచ్చిన తర్వాత మైసూరులోని సీఎఫ్​టీఆర్ఐలో పదవీ విరమణ చేసిన టెక్నికల్‌ ఆఫీసర్‌ని టీటీడీ ల్యాబ్‌కి ఇంఛార్జ్​గా నియమించారు. ఆయన టీటీడీ ఉద్యోగి కాకపోవడంతో జవాబుదారీతనం లేదన్న విమర్శలు ఆది నుంచి ఉన్నాయి.

జగన్ తన బంధువులు, సామాజిక వర్గానికి చెందినవారు, సన్నిహితులకు తిరుమల కొండను అప్పగించారు. వారి అవినీతి, అస్తవ్యస్త నిర్ణయాలతో తిరుమలలో అనేక అపచారాలు చోటుచేసుకున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రూ.25 ఉండే లడ్డూ ధర కరుణాకర్‌రెడ్డి హయాంలో రూ.50కి పెంచేశారు. పెద్దలడ్డూ ధర సైతం రెట్టింపు చేశారు. ధర పెరిగితే నాణ్యత పెరగాలి కానీ కల్తీ నెయ్యి వినియోగించి భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే ఏంటని పలువురు నిలదీస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు సహా అనేక కుంభకోణాలకు వైఎస్సార్సీపీ పాలనలోనే తెరతీశారు. త్వరలోనే అన్నీ బయటపడతాయని భక్తులు అంటున్నారు.

తిరుమల లడ్డూ ఎలా తయారు చేస్తారు? - ఏయే వస్తువులు వినియోగిస్తారో తెలుసా! - How to make Tirumala Laddu

లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్‌ - ‘శ్రీవారి ఫొటోలు తొలగించేందుకు జగన్‌అండ్‌ కో యత్నం’: కేంద్రమంత్రి తీవ్ర ఆరోపణలు - Union Ministers on Tirumala Laddu

ABOUT THE AUTHOR

...view details