TIRUMALA LADDU QUALITY :స్వచ్ఛత, నాణ్యతకు తిరుమల తిరుపతి లడ్డూ పెట్టింది పేరు. భక్తులు ఎంతో పవిత్రంగానూ భావించే తిరుపతి లడ్డూలో కొన్నాళ్లుగా నాణ్యత లోపించిందనేది వాస్తవం అంటున్న భక్తులు, కూటమి ప్రభుత్వం వచ్చాక భోజనంలోనూ గణనీయమై మార్పులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని, శ్రీవారి అన్న ప్రసాదం రుచిగా ఉందని చెప్తున్నారు.
నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలను సందర్శించి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో పరిశుభ్రత మొదలుకుని, భక్తుల వసతి, క్యూలైన్లు, అన్న ప్రసాదాల నిర్వహణకు టీటీడీ అధికారులు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందు తిరుపతిలో అధ్వాన పరిస్థితులు ఉన్నాయని భక్తులు మండిపడుతున్నారు. గదుల అద్దె దాదాపు 2000శాతానికి పెంచి జేబులు గుల్ల చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరిశుభ్రత లోపించిందని, ప్రసాదాల్లో నాణ్యత కరువైందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పలుమార్లు భోజన ప్రసాదాలు తినడానికి ఏ మాత్రం వీల్లేని పరిస్థితిలో ఉన్నాయని ఆందోళన చేయడం కూడా విదితమే. ఇదిలా ఉంటే లడ్డూ తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టులు కూడా తేల్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం లడ్డూ పవిత్రతను పునరుద్ధరించింది. అన్న ప్రసాదాల్లోనూ నాణ్యమైన సరుకులు వినియోగిస్తోంది.
ప్రసాదాల్లో నాణ్యత పెరిగింది. గతంతో పోలిస్తే ఎంతో బాగుంది. రుచి, శుచి పెరిగినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అన్న ప్రసాదాల్లో నాణ్యత చాలా మెరుగుపడింది. - చంద్రమౌళి, శ్రీకాకుళం జిల్లా