ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ అధికారి తీరే అంత! కొండపై దొరికిన వస్తువులు స్వాహా - TIRUMALA COMMAND CONTROL SCAM

తిరుమలలో భక్తుల సొత్తుని వాడుకుంటున్న విజిలెన్స్​ ఇన్​స్పెక్టర్​ - విచారించి నామమాత్రంగా చర్యలు

Tirumala Command Control Vigilance Inspector Fraud
Tirumala Command Control Vigilance Inspector Fraud (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2025, 9:55 AM IST

Tirumala Command Control Vigilance Inspector Fraud :సొత్తు ఎవరైనా కాజేస్తే నేరం. కానీ దొంగల నుంచి పట్టుకున్న సొత్తు, అలాగే భక్తులు మరిచిపోయిన వస్తువులు తిరిగి అప్పగించాల్సిన బాధ్యతగల అధికారులే వాటిని వాడుకుంటే ఏమనాలి? వైఎస్సార్సీపీ హయాంలో ఇలాగే ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తిరుమలలో దొరికిన వివిధ వస్తువులను రికార్డుల్లో నమోదు చేయకుండా ఆ అధికారి స్వాహా చేసినట్టు విజిలెన్స్‌ విచారణలోనే వెలుగుచూసింది. అయిన దాన్ని కప్పిపుచ్చి సొంత శాఖకు పంపారు.

తిరుమలలో కమాండ్‌ కంట్రోల్‌ విభాగం అనేది అత్యంత కీలకమైనది. శ్రీవారి భక్తులు అనేకమంది తమ వస్తువులు, నగదు, ఆభరణాలు పలు ప్రాంతాల్లో పొరపాటున మరిచిపోతుంటారు. వీటిలో కొన్నింటిని దొంగలు సైతం కాజేస్తుంటారు. మరికొన్నింటిని అధికారులు వివిధ సీసీ టీవీ ఫుటేజీలలో గుర్తించి కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి చేర్చుతారు. అనంతరం అక్కడి రికార్డుల్లో నమోదు చేసి, ఎవరైనా భక్తులు ఫిర్యాదుచేస్తే విచారించి ఆ వస్తువులను తిరిగి ఇస్తుంటారు.

విచారణ నివేదికలో ఏముంది?

వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023లో కమాండ్‌ కంట్రోల్‌లో విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ (వీఐ)గా శివశంకర్‌ ఉన్నారు. ఇయన భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై అప్పట్లోనే విజిలెన్స్‌ భద్రతాధికారి పద్మనాభన్‌ విచారించి నివేదిక సైతం ఇచ్చారు. ‘వీఐ శివశంకర్‌ రికార్డులు సరిగా నిర్వహించలేదు. భక్తులు పోగొట్టుకున్న బ్లూటూత్‌, సెల్‌ఫోన్లలను శివశంకర్‌ సూచనల మేరకు సిబ్బంది వాడుకున్నారు’ అని తన నివేదికలో పొందుపరిచారు.

'వివిధ సందర్భాల్లో దొరికిన బంగారు, వెండిలాంటి ఆభరణాలను శ్రీవారి హుండీలో డిపాజిట్‌ చేసి సీసీ టీవీలో రికార్డు చేయించేవారు. అలాగే మరికొన్నింటిని హుండీలో డిపాజిట్‌ చేసినట్లు చెబుతున్నా సీసీ టీవీలో మాత్రం రికార్డు చేయలేదు. ఇలా నిబంధనలు అతిక్రమిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా మర్చిపోయి, పైగా వారిని ప్రోత్సహిస్తున్నారు. తన హోదాను వీఐ శివశంకర్‌ దుర్వినియోగం చేశారు. ఇలా దొరికిన సొమ్మును కార్యాలయ అవసరాలకు వాడారు' అని నివేదికలో విజిలెన్స్‌ భద్రతాధికారి పద్మనాభన్‌ స్పష్టం చేశారు.

సిబ్బంది ఏం చెప్పారంటే?

అయితే విచారణ అధికారులకు కార్యాలయంలోని సిబ్బంది పలు విస్తుగొలిపే అంశాలను చెప్పారు. దొంగలు, నిందితులు నుంచి స్వాధీనం చేసుకున్న నగదును వీఐ శివశంకర్‌ ఆదేశాల ప్రకారమే కార్యాలయంలో టీ, ఆహారం ఇతర అవసరాలకు ఖర్చు చేశారని సెక్టార్‌4లో పని చేస్తున్న శంకరయ్య తెలిపారు. అదేవిధంగా టికెట్లు, లడ్డూ ప్రసాదాల కోసమూ ఈ డబ్బులను వాడుకున్నారని వెల్లడించారు. 'దొంగలనుంచి స్వాధీనం చేసుకున్న వివిధ రకాల ఎలక్ట్రానిక్‌ పరికరాలను రిజిస్టర్‌లో ఎంటర్ చేయకుండా కొందరు సిబ్బంది వాడుకున్నారు' అని 13 సంవత్సరాలుగా పలు సెక్టార్లలో పనిచేస్తున్న నాగరాజు విచారణ అధికారులకు చెప్పారు. అలాగే వెండి, బంగారంలాంటి ఆభరణాలను హుండీలో వేసేవాళ్లని వివరించారు. 'నాకు దొరికిన ఒక ఐఫోన్‌ను వీఐ శివశంకర్‌కు అప్పగించా, దాన్ని ఆయన పక్కనే ఉండే మరో వ్యక్తి రమేష్‌బాబుకు ఇచ్చారు' అని నాగరాజు తెలిపారు. భక్తులు కోల్పోయిన వివిధ వస్తువుల వివరాలను అసలు రిజిస్టర్‌లో నమోదు చేసేవారు కాదని సీసీ టీవీ ఆపరేటర్‌గా సి-షిఫ్ట్‌లో పని చేసిన రమేష్‌బాబు తెలిపారు.

నామమాత్రంగా చర్యలు..

అక్రమాలకు పాల్పడిన అధికారిపై అప్పటి టీటీడీ ఉన్నతాధికారులతోపాటు ప్రభుత్వం కూడా నామమాత్రంగానే చర్యలు తీసుకుంది. వాస్తవానికి వీఐ శివశంకర్​పై కేసు నమోదు చేసి విచారించాలి. చివరికి ఆరోపణలు రుజువు కావడంతో సస్పెండ్‌ చేయాల్సి ఉంది. కానీ మాతృశాఖ రాష్ట్ర పోలీసు విభాగానికి తిప్పి పంపించింది. భక్తుల సొమ్మును తిన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికే అండగా నిలిచి ఆయనపై ఎటువంచి చర్యలు తీసుకోకుండా వదిలేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాటి విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా తిరుమలలో అక్రమాలకు పాల్పడిన ఆ అధికారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న విన్నపాలున్నాయి.

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​ - ఇలా చేస్తే టీటీడీ క్యాలెండర్లు, డైరీలు ఇంటికే!

తిరుమలలో గదులు పొందడం మరింత సులభం - టీటీడీ కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details