YOUTH HARASSED ENGINEERING STUDENT: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో ఇంజినీరింగ్ విద్యార్థినికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. నందిగామ ఏసీపీ బాలగంగాధర్ తిలక్, బాధితురాలి కథనం ప్రకారం, తిరువూరుకు చెందిన ఓ యువతి (19) ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఓ హాస్టల్లో ఉంటూ కళాశాలకు వచ్చి వెళుతోంది.
పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (25) ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో యువతిని నమ్మించాడు. గత నెల 12వ తేదీన తన ఇంట్లో ఫంక్షన్ ఉందంటూ హుస్సేన్ ఆహ్వానించడంతో ఆమె వచ్చింది. ఆ సమయంలో పెయింటర్‌గా పనిచేసే పరిటాలకు చెందిన షేక్ గాలి సైదా (26), చింతల ప్రభుదాస్ (25)లు కూడా హుస్సేన్ ఇంటిలోనే ఉన్నారు. యువతి చదివే కాలేజీలోనే ప్రభుదాస్ కూడా ఇంజినీరింగ్ చదువుతున్నాడు.
అయితే అక్కడ ఫంక్షన్ ఏమీ లేకపోవడంతో యువతి నిలదీసింది. నీతో ఒంటరిగా మాట్లాడాలని పిలిచానంటూ హుస్సేన్ ఆమెను నిమ్మించాడు. ఆ తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి హుస్సేన్ బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికి షేక్ గాలి సైదా గది లోపలకు వచ్చి, హుస్సేన్‌తో నువ్వు దిగిన ఫొటోలు నా దగ్గర ఉన్నాయని, వాటిని బయటపెడతానంటూ బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి అరుపులు వినిపించకుండా టీవీ సౌండ్ పెద్దగా పెట్టారు.