ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైక్ ఎక్కిన హైటెక్‌ హరిదాసు - సంక్రాంతి సందడి మొదలైంది - SANKRANTI SPECIAL 2025

వేషధారణ మార్చిన హరిదాసులు - బైక్​పై ఊళ్లలో చక్కర్లు

బైక్ ఎక్కిన హైటెక్‌ హరిదాసు
బైక్ ఎక్కిన హైటెక్‌ హరిదాసు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2025, 4:42 PM IST

Updated : Jan 2, 2025, 5:06 PM IST

Sankranti Special 2025 : రోజులు మారుతున్నాయి. కాలంతో పాటే సంస్కృతి, సంప్రదాయాలు కూడా రూపం మార్చుకుంటున్నాయి. టెక్నాలజీ, అవసరాలకు అనుగుణంగా వృత్తులు కూడా మారిపోతున్నాయి. ధనుర్మాసంలో, ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజుల్లో ఇంటింటికీ వచ్చి బియ్యం, ధాన్యం దానం తీసుకునే హరిదాసు వేషం కూడా మారిపోయింది.

నుదుట తిలకం, ఓ చేతిలో చిరతలు, మరో చేతిలో వీణ, తలపై అక్షయపాత్ర, దాని చుట్టూ పూలదండ, కాలికి గజ్జెలు, మెడలో పూలహారంతో ఇంటింటికీ వచ్చే హరిదాసు గుర్తున్నాడా? కీర్తనలు ఆలపిస్తూ హరిదాసులు ముంగిళ్లలోకి రాగానే ఇంటి ఆడపడుచులు గుప్పెడంత బియ్యం దానం చేయడం సంప్రదాయం. రెండిళ్ల ఆవల ఉండగానే గుమ్మం ముందు బియ్యం పళ్లెంతో గృహిణులు, పిల్లలు ఎదురు చూసేవారు. ఇంటి ముందు హరిదాసు మోకరిల్లగానే తలపై పాత్రలో బియ్యం పోసి నమస్కరించేవారు.

శ్రీ మహా విష్ణువు ప్రతినిధులుగా చెప్పుకొనే హరిదాసులను మన పెద్దలు పరమాత్మతో సమానంగా భావించేవారు. హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసీ తెలియక చేసిన ఎన్నో పాపలు తొలగిపోతాయని విశ్వాసం. దాన ధర్మాలను స్వీకరించే హరిదాసులు కుటుంబంలో సిరిసంపదలు కలగాలని, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని దీవిస్తుంటారు. ఇదీ హరిదాసుల నేపథ్యం.

SANKRANTI SPECIAL 2025 (ETV Bharat)

అయితే ప్రస్తుతం ధనుర్మాసంలో హరిదాసులు సందడి చేస్తున్నారు. హరిదాసులు ఓ చేతిలో చిరతలు, మరో చేతిలో వీణ పట్టుకుని తలపై పాత్రని ఎప్పుడు పడితే అప్పుడు దింపేవారు కాదు. ఇప్పుడు తీరుమారింది. కాకినాడ జిల్లా శంఖవరం ప్రాంతానికి చెందిన ఓ హరిదాసు అలాగే ఏలూరు జిల్లాలోనూ ఓ హరిదాసు మోపెడ్​పై వెళ్తూ దాన ధర్మాలు స్వీకరిస్తున్నాడు. గతంలో పాటలు పాడుతూ ఇంటింటికీ వెళ్లే సంస్కృతి ఉండగా తాజాగా మోపెడ్​కు మైక్ పెట్టుకుని అక్షయ పాత్రను సైతం బండికే అమర్చి వృత్తి నిర్వహిస్తున్నాడు. రయ్‌మంటూ ఊళ్లోకి వస్తూ వీధుల్లో తిరుగుతూ వెళ్లిపోతున్నారు.

కనుమ అంటేనే కోనసీమ - ప్రభల తీర్థంపై ప్రధాని మోదీ లేఖ

సంక్రాంతి పండగకు ప్రత్యేక రైళ్లు - జనవరి 2 నుంచి బుకింగ్

ఆ పుంజు స్పెషల్​ - రేటు తెలిస్తే షాక్​

Last Updated : Jan 2, 2025, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details