TET Topper Ashwini From Vizianagaram District :విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రు అశ్విని టెట్ ఫలితాల్లో వందశాతం మార్కులు సాధించారు. పేపర్-1ఏ (ఎస్జీటీ)లో ఆమెకు 150 మార్కులకు 150 మార్కులు వచ్చాయి. 2014-16 మధ్య డైట్ పూర్తి చేసిన ఆమె వరుసగా ఐదు సార్లు టెట్లకు పోటీపడ్డారు. తల్లి దండ్రులు వెంకటలక్ష్మి, కె.శంకరరావు ప్రోత్సాహంతో డీఎస్సీ సాధించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.
ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు నిన్న (సోమవారం) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. అక్టోబర్ 3 నుంచి 21వ వరకు టెట్ పరీక్షలు జరగ్గా ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 29న తుది కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 (86.28%) మంది హాజరయ్యారు. పరీక్షల్లో 1,87,256 (50.79 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
వందకు వంద శాతం మార్కులు.. ఎలా చదివావమ్మ?
టెట్ ఫలితాల్లో 150కి 150 మార్కులు సాధించిన యువతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2024, 10:46 AM IST
|Updated : Nov 5, 2024, 10:52 AM IST
టెట్‌లో అర్హత సాధించిన వారికి మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్ డెస్క్ నంబర్లకు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని లోకేశ్ అన్నారు. టెట్ ఫలితాల విడుదల సందర్భంగా ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.
మరోవైపు మెగా డీఎస్సీకి సంబంధించి 16,347 పోస్టులతో ఈ నెల 6న ప్రకటన విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రకటన విడుదల తేదీ నుంచి నెలరోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు.సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే డీఎస్సీ దస్త్రంపై సంతకం చేశారు. డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో మొదట టెట్ నిర్వహించిన సంగతి తెలిసింది.