AP Government On Employee Health Scheme:ఉద్యోగుల హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లు తెలంగాణాలోని డీఎంఈ గుర్తించిన అన్ని ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునేందుకు అనుమతి ఇస్తూ సర్క్యులర్‌ను జారీ చేసింది. తెలంగాణా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గుర్తించిన అన్ని ఆస్పత్రులను పరిగణలోకి తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది.
తెలంగాణలో ఏపీ ఉద్యోగులకు వైద్యసేవలు:తెలంగాణలో 11 ఆసుపత్రులను మాత్రమే గుర్తించటంతో ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2015 తరువాత ట్రస్టు గుర్తింపు పొందని ఆస్పత్రుల్లో వైద్యానికి అనుమతి లేకపోవటంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు లేని ఆస్పత్రుల్లో వైద్యచికిత్సలకు బిల్లులు రీయింబర్స్ కూడా చేయకపోవటంతో ఇప్పటి వరకూ ఉద్యోగులు, పెన్షనర్లు పెద్దఎత్తున నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ తెలంగాణ డీఎంఈ గుర్తించిన అస్పత్రులన్నింటిలో వైద్య చికిత్సలు చేయించుకునేందుకు వైద్యారోగ్యశాఖ ఆమోదాన్ని తెలియచేసింది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు చాలా మంది హైదరాబాద్‌లో సెటిల్ అయినట్టు ప్రభుత్వం సదరు మెమోలో పేర్కొంది. 9, 10 షెడ్యూల్ సంస్ధలకు చెందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఇంకా హైదరాబాద్ నివసిస్తుండటంతో అక్కడ వారికి ఈహెచ్ఎస్ ద్వారా వైద్యచికిత్సలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు సదరు ఆస్పత్రులన్నింటినీ గుర్తించాల్సిందిగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు సీఈఓను ఆదేశిస్తూ వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు.