TDP leaders react on CM Jagan Comments: అనంతపురం జిల్లా ఉరవకొండ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం నేతలు కౌంటర్ ఇచ్చారు. అక్కాచెల్లెమ్మలను చివరిసారి కూడా మోసం చేసేశాడని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఆరోపించగా, రాజకీయ లభ్ధి కోసమే జగన్ రెడ్డి బీసీ కులగణన చేపట్టాడని కాలవ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి నాసిరకం మద్యంతో మహిళల మాంగల్యాలు తెంచుతున్నారని పరిటాల సునీత ఆరోపించగా, మోసపూరిత మాటలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
నక్కా ఆనంద్ బాబు: జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఆ డబ్బు మహిళల ఖాతాలోకి కాకుండా తాడేపల్లి ప్యాలెస్ కు పోతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకే ఎన్నికల్లో లక్షలాది మంది స్టార్ క్యాంపైనర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కోడికత్తి శ్రీను సహా, ఊచకోతకు గురైన 300మంది దళితులంతా జగన్ ఓటమి కోసం పని చేసే స్టార్ క్యాంపైనర్లేనని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. మద్యనిషేధం హామీ అమలు చేయకపోగా నాసిరకం మద్యంతో తాళిబొట్టు తెగిన ప్రతీ మహిళా స్టార్ క్యాంపైనరేనన్నారు. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలు తట్టుకోలేక ఆ పార్టీ ఖాళీ చేసేందుకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారని తెలిపారు.
వైద్యం అందక మరో గిరిజన బిడ్డ మరణం - 15 రోజుల్లోనే ముగ్గురు మృతి
కాలవ శ్రీనివాసులు: రాజకీయ లభ్ధికోసమే జగన్ రెడ్డి బీసీ కులగణన చేపట్టాడని టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లు పొందాలనే రాజకీయ కుట్ర తప్ప, నిజంగా ఆ వర్గాలకు మంచి చేయాలనే ఆలోచన జగన్కు లేదని మండిపడ్డారు. ఇన్నేళ్లూ కులగణనపై కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు ఒత్తిడి చేయలేదని నిలదీశారు. అడగాల్సిన చోట అడగకుండా, మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకుండా బీసీల కులగణన పేరుతో కుట్రలు చేయడం జగన్ రెడ్డి రాజకీయ అవకాశవాదమేనని కాలవ శ్రీనివాసులు దుయ్యబట్టారు.