Chandrababu Oath Ceremony As CM :రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని, ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉంది. నూటికి నూరు శాతం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పని చేశారని కొనియాడారు ఎన్నికల్లో 93 శాతం సీట్లు గెలవడం దేశ చరిత్రలో అరుదని అన్నారు. ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని, ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగిందని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నాం :జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందిందని, బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుచుకుందని గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల దిల్లీలో అందరూ గౌరవించారని, ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ఠ పెరిగిందని అన్నారు. పవన్ కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేనని కొనియాడారు. తాను జైలులో ఉన్నప్పుడు ఆయన వచ్చి పరామర్శించారని, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారని, బీజేపీ, టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నామని, ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పనిచేశామని స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరం :అందరి సహకారంతో బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీయే నేతలు హాజరవుతున్నారని చంద్రబాబు తెలిపారు. సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరమని, రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర నేతలు చెప్పారని తెలిపారు. 14 ఏళ్లుగా సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని గుర్తు చేశారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లామని, ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని, రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని, సంక్షోభంలో ఉందని, అన్ని వర్గాలు దెబ్బతిన్నాయని అన్నారు. రైతులు అప్పులపాలయ్యారని, పదేళ్ల తర్వాత రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితని, కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదని, అమరావతి రాజధానిగా ఉంటుందని, విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందామని చంద్రబాబు వెల్లడించారు.