ఉద్యోగం మానేసి బెస్ట్‌మార్ట్ యాప్‌కు రూపకల్పన - అనతికాలంలోనే 2 తెలుగు రాష్ట్రాలకు విస్తరణ Success Story of Veeranaga Trinath who Created Bestmart App:సాధారణంగా ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్లు ఏ వస్తువు సరైనదో ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో తెలీక అయోమయానికి గురవుతుంటారు. అలాగే నచ్చిన వస్తువు కోసం గంటల తరబడి వెతుకుతూ సమయం వృథా చేస్తుంటారు. దీన్నే వ్యాపార సూత్రంగా మలుచుకున్నాడు ఓ ఔత్సాహికుడు. కస్టమర్లకు, వ్యాపారవేత్తలకు ఉపయోగపడేలా ఓ యాప్‌ను రూపొందించాడు. అనతికాలంలోనే 2 తెలుగు రాష్ట్రాలకూ సేవలు విస్తరించి మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. మరి, ఆ సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏదో సాధించాలనే తపన - కిలిమంజారో అధిరోహించి రికార్డు - IFS Officer Climbed Kilimanjaro
బీటెక్ పూర్తయ్యాక మంచి ఉద్యోగంలో స్థిరపడినా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనే ఆలోచనలు ఇతడిని ఎప్పుడూ వెంటాడేవి. కొన్నాళ్ల తర్వాత భయాందోళనలు పక్కకు పెట్టి స్నేహితుల సాయంతో బెస్ట్‌మార్ట్ యాప్ రూపకల్పనలో తలమునకలయ్యాడు. వ్యాపారవేత్త గా ఎదగాలనే కల నెరవేర్చుకోవడంతో పాటు ఇతరులకూ ఉపాధి కల్పిస్తూ సంతృప్తి పొందుతున్నాడు వీరనాగ త్రినాథ్ అనే వ్యక్తి. వీరనాగ త్రినాథ్‌ది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం. బీటెక్ తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. నెలవారీ జీతంతో జీవితం సాఫీగా సాగిపోతున్నా వ్యాపారం చేయాలనే కోరికతో ఎక్కువకాలం ఉద్యోగంలో కొనసాగలేకపోయాడు.
3అంగుళాల పొడవైన అరుదైన ద్రాక్ష-దేశవిదేశాల్లో ఫుల్ డిమాండ్- రైతుకు రూ.లక్షల్లో ఆదాయం
తల్లిదండ్రులు వారించినా మనస్సుకు నచ్చిన వ్యాపారంలో రాణించగలనని బలంగా నమ్మాడు. రెండున్నర సంవత్సరాల క్రితం సుమారు 30 లక్షల రూపాయల పెట్టుబడితో విజయవాడ కేంద్రంగా బెస్ట్‌మార్ట్ యాప్‌పై పని చేయటం మొదలుపెట్టాడు. మాములుగా ఇతర ఆన్‌లైన్ యాప్‌లలో కస్టమర్లు నేరుగా అమ్మకందారులతో మాట్లాడే సౌలభ్యం ఉండదు. కానీ కస్టమర్లు, వ్యాపారవేత్తలు ఇద్దరికీ మేలు చేకూర్చేలా బెస్ట్‌మార్ట్ యాప్‌ను రూపొందించాడు త్రినాథ్. ఆన్‌లైన్ కస్టమర్లు తక్కువ సమయంలోనే నాణ్యమైన వస్తువులు కొనుక్కోవడంతో పాటు వ్యాపారులకూ అమ్మకాలు పెరిగేలా చేస్తున్నాడు.
IAS కావాలనుకొని 'BTech పానీపూరివాలా'గా- యువతి సక్సెస్ స్టోరీ అదుర్స్
3 నెలల క్రితం పూర్తిస్థాయిలో బెస్ట్‌మార్ట్ యాప్ సేవలను మొదలుపెట్టాడు త్రినాథ్. ఉద్యోగం చేసేటప్పుడు కొన్నిసార్లు ఒత్తిడికి గురయ్యేవాడినని ఇప్పుడు అన్ని ఖర్చులూ పోను నెలకు 3 లక్షల రూపాయలు వస్తోందని అంటున్నాడు. తనద్వారా 25 మందికి ఉపాధినీ కల్పిస్తుండటం ఆనందంగా ఉందని చెబుతున్నాడు. ప్రస్తుతం బెస్ట్‌మార్ట్ యాప్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు 5 వేల రకాల సేవలు అందిస్తున్నాడు త్రినాథ్. ఇప్పటికే కొంతమంది ఫ్రాంచైజీలు తీసుకుని సొంతూరిలోనే మంచి ఆదాయం పొందుతున్నారని చెబుతున్నాడు. ఏ పనిచేసినా అది ఇష్టంతో, ప్రణాళికతో చేసినప్పుడే విజయం సాధించగలరని చెబుతున్నాడు త్రినాథ్. బెస్ట్‌మార్ట్ సేవలను తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకూ విస్తరించే దిశగా కృషి చేస్తున్నాడు.