Success Story Transgender Anand Babu Transforms into Hanna Rathod : ట్రాన్స్‌జెండర్లు అంటేనే ఒకరకమైన చిన్నచూపు. అందుకు జన్యుపరమైన లోపమే కారణమని అర్థం చేసుకునేందుకు ఎవరూ ప్రయత్నించరు. కన్నవారే బయటికి గెంటేస్తుంటారు. అలాంటి పరిస్థితి తనకూ వస్తుందేమోనని భయపడి, ఉన్నతస్థాయికి చేరాకే ట్రాన్స్‌ఫ్యూజన్ చేయించుకున్నట్లు బయటపెట్టింది హన్నారాథోడ్. స్పెయిన్‌లో శాస్త్రవేత్తగా పని చేస్తూనే గతేడాది మిస్ వరల్డ్ ట్రాన్స్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచి తోటి ట్రాన్స్‌జెండర్లలో స్ఫూర్తి నింపుతోంది.
అనంతపురం జిల్లా సోమలదొడ్డి గ్రామంలో ఆనంద్‌బాబుగా పుట్టిన హన్నారాథోడ్ మల్లేష్, పద్మావతి మూడో సంతానం. తల్లిదండ్రులు పండ్ల వ్యాపారం చేసేవారు. రోజులో ఒక్క పూటైనా కడుపు నిండుతుందనే ఆశే తనను బడి బాట పట్టించింది. చదువుపై ఇష్టం పెంచింది. క్లాస్‌లో టాపర్‌గా నిలిపింది. అయితే 6 ఏళ్ల వయసులోనే తన లోపం తెలియడం ప్రారంభమైంది.
అమ్మాయిలా ఉండాలనే కోరిక గురించి తెలిస్తే చదువుకు ఆటంకం కలుగుతుందేమోనని భయం హన్నాను వెంటాడేది. అమ్మానాన్న మనసు కష్టపెట్టవద్దని మనోవేదన అనుభవిస్తూనే చదువుల్లో మాత్రం ఎక్కడా వెనకబడలేదు. దాతల సహాయంతో బీఫార్మసీ కూడా పూర్తయిపోయింది. కాలేజీలో ఉన్నప్పటి నుంచే విదేశాల్లో ఎంఎస్ చేయాలని హన్నా కలగా ఉండేది. కానీ ఆర్థిక పరిస్థితి అనుకూలించక అనంతపురంలోని ఓ పాఠశాలలో టీచర్‌గా 2ఏళ్లు పనిచేయాల్సొచ్చింది. జూనియర్ ఫార్మా విద్యార్థులకు ట్యూషన్లు చెప్పగా వచ్చిన కొద్దిపాటి ఫీజులు తన పొదుపునూ పెంచాయి. అంతలోనే అనంతపురం కలెక్టరేట్ ఆఫీసులో ఉద్యోగం రావడంతో పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి మొదలైంది.
వివాహం చేసుకుని మరో అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదని హన్నా ఆలోచన. అలా విదేశాల్లో ఎంఎస్ అవకాశం కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. అర్హత పోటీల్లో వేలమందిని వెనక్కి నెట్టి స్పెయిన్‌లో MS సీటు కూడా దక్కింది. తర్వాత బయో ఇంజనీరింగ్ సొల్యూషన్స్‌లో సైంటిస్ట్‌గా అవకాశం వచ్చింది. శాస్త్రవేత్తగా స్థిరపడే వరకూ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు హన్నా. పళ్ల వ్యాపారి కుమారుడి నుంచి హన్నారాథోడ్‌గా ఎలా మారిందో వివరిస్తోంది.