Students Complaint on School Teachers:మా గోడు వినండి. ఉపాధ్యాయుల వేధింపులు పడలేకపోతున్నాం. పాఠశాలలో ఒత్తిడికి గురవుతున్నాం అంటూ విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. గత నాలుగేళ్లుగా మానసిక వేదనకు గురిఅవుతున్నామని కలెక్టర్‌కు తమ ఆవేదనను వెలిబుచ్చారు. దీనిపై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఉన్నతాధికారులు స్పందించలేదని విద్యార్థులు వాపోయారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కలెక్టర్ వద్దకు వచ్చామని వారి సమస్యను వినిపించారు.
వివరాల్లోకి వెళ్తే:నెల్లూరు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల గోడు కలెక్టరేట్లో మార్మోగింది. పదోతరగతి విద్యార్థులు తల్లితండ్రులతో ర్యాలీగా వచ్చారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆరో తరగతి నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు మానసికంగా వేధిస్తున్నారని, ఇప్పడు పదో తరగతికి వచ్చినా వారిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
శిథిలావస్థలో పాఠశాల భవనాలు - కొత్తవి నిర్మించాలని విద్యార్థుల మొర - Dilapidated School Buildings
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాసులు, సోషల్ మేడమ్ ప్రసన్న లక్ష్మీ గత కొన్ని సంవత్సరాలుగా తమ పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌కు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. డౌట్స్ అడిగితే కొడుతున్నారని, అమ్మాయిలను తెలుగు టీచర్ శ్రీనివాసులు అసభ్యంగా పిలుస్తున్నాడని తెలిపారు. దీనిపై డీఈవోకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. సరిగా పాఠాలు చెప్పట్లేదని, సిలబస్ కూడా పూర్తికాలేదని తెలిపారు. ఇలా అయితే పదోతరగతి ఎలా ఉత్తీర్ణులవుతామని అంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
"మా పాఠశాలలో సోషల్ టీచర్, తెలుగు ఉపాధ్యాయుడు సరిగా క్లాసులు చెప్పట్లేదు. డౌట్లు అడిగితే బూతులు తిడుతున్నారు. అమ్మాయిలను తెలుగు టీచర్ అసభ్యంగా పిలుస్తున్నారు. ఈ ఇద్దరు టీచర్లపై హెచ్ఎం మేడమ్‌కి కంప్లైంట్ చేస్తే.. ఆమెతో ఈ ఇద్దరు ఉపాధ్యాయులు గొడవకు దిగుతున్నారు. వీరిపై డీఈవోకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇలా అయితే మేము పదో తరగతి పాస్ కాలేము." - విద్యార్థులు
"మా పిల్లలు చదువుతున్న స్కూల్లో ఉపాధ్యాయులు సరిగా బోధించట్లేదు. ఆడపిల్లలు అని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారంట. మా ఆర్థిక పరిస్థితి సరిగా లేక మేము గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాం. ఇప్పుడు ఇక్కడ సరిగా బోధించకపోతే మా పిల్లలు పదో తరగతి ఎలా పాస్ అవుతారు?. ఈ ఇద్దరు టీచర్లపై తగిన చర్యలు తీసుకుని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం."- విద్యార్థుల తల్లిదండ్రులు
విద్యార్థులపై జగన్ సర్కారు వివక్ష- ఎన్ఐడీలో మౌలిక వసతుల్లేక అవస్థలు - NID Students Problems