Heavy Rains in Tirumala :ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అదే విధంగా జిల్లాలోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. తిరుమలలో భారీ వర్షం కురుస్తుండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పూర్తి స్ధాయిలో నిండిపోయిన జలాశయాలు :తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో చలి తీవ్రత పెరిగింది. వర్షం కారణంగా శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దర్శనానంతరం లడ్డూ విక్రయ కేంద్రాలకు, గదులకు వెళ్లే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు గోగర్భం, పాపవినాశనం జలశయాలు పూర్తి స్ధాయిలో నిండిపోయాయి. గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
మరోవైపు భారీ వర్షాలతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. పాపవినాశనం, ఆకాశగంగ, శ్రీవారి పాదాలు, శిలాతోరణం వెళ్లే మార్గాల్లో భక్తుల వాహన రాకపోకలను నిలిపివేశారు. ఘాట్ రోడ్డుల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. టీటీడీ సిబ్బంది జారిపడ్డ బండరాళ్లను తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్లలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.
వచ్చే వారం మరో అల్పపీడనం- పది రోజులు కోస్తా, రాయలసీమలో వానలు
భక్తులను నిలిపివేసిన టీటీడీ :భారీ వర్షానికి తిరుపతి వీధులు జలమయం అయ్యాయి. లక్ష్మీపురం కూడలి, గొల్లవానిగుంటలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. వెస్ట్ చర్చి కూడలిలో రైల్వే అండర్ బ్రిడ్జి వర్షపు నీటితో నిండింది. అధికారులు వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. బాలాజీ కాలనీ నుంచి మహిళా వర్సిటీ మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. తిరుపతిలో మాల్వాడిగుండం జలపాతం పొంగిపొర్లుతోంది. కపిలతీర్థం పుష్కరిణికి వెళ్లకుండా టీటీడీ భక్తులను నిలిపివేసింది.
అప్రమత్తంగా ఉండాలి :ఇన్ చార్జ్ కలెక్టర్ శుభం బన్సాల్ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని అదే విధంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో 11 గంటలకు గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగవకు వదిలారు.
మదనపల్లెలో చిరుజల్లులు :అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు పడుతున్నాయి. రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో మోస్తరు వర్షం, రాయచోటి, పీలేరు, మదనపల్లెలో చిరుజల్లులు కురుస్తున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు.
తిరుమలలో భారీ వర్షం - శ్రీవారి భక్తులకు ఆ మార్గాల్లో నో ఎంట్రీ
మరింత బలపడనున్న అల్పపీడనం - రైతులకు కీలక సూచనలు