Frauds in Endowment Department :దేవాదాయశాఖలో కొందరి అధికారుల తీరు కంచె చేను మేసిన చందంగా మారింది. దేవుడి సొమ్మును కాపాడాల్సిన వారే దోచుకునేందుకు యత్నిస్తున్నారు. ఆలయాల నిధులను సైతం దుర్వినియోగం చేస్తున్నారు. దేవాదాయశాఖకు చెందిన ఓ ఇంఛార్జ్ ఈఓ దేవుడి సొమ్ముతో రూ.కోటికి పైగా పెట్టి క్రికెట్ బెట్టింగ్‌లు ఆడేశారు.
మరో ఈఓ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా కొందరిని ఆలయ ఉద్యోగులుగా నియమించి నాలుగైదు నెలలుగా జీతాలు చెల్లిస్తున్నారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలానికి ఆర్జేసీ కేడర్ అధికారి బదులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కింది కేడర్ అధికారికి ఈఓ బాధ్యతలు అప్పగించారు. ఇలా దేవాదాయశాఖలో కొందరు ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం, తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుండటంతో కొందరు ఈఓలు అడ్డగోలుగా అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఉద్యోగాలు, జీతాలు - అంతా ఆయన ఇష్టమే :కొన్ని నెలల కింద ఎన్టీఆర్ జిల్లాలోని తిరుమలగిరి ఆలయ ఈఓ పలువురిని ఉద్యోగులుగా నియమించుకున్నారు. వాస్తవానికి ఉన్నతాధికారుల అనుమతితో వారిని పొరుగుసేవల కింద గానీ, కాంట్రాక్ట్ పద్ధతిలోగానీ తీసుకోవాలి. కానీ అవేమీ లేకుండా నేరుగా నియమించేసుకున్నారు. మొదట రెండు నెలల జీతాలను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. జీతాలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తే వాళ్లు ఆలయ ఉద్యోగులు అవుతారు. ఇది నిబంధనలకు విరుద్ధమని కమిషనరేట్‌కు ఫిర్యాదులు రావడంతో, సమగ్ర వివరాలివ్వాలని అధికారులు ఆదేశించారు. ఈఓ ఇవేమీ పట్టించుకోకుండా తాజాగా మరో రెండు నెలల జీతాలను కూడా దర్జాగా చెల్లించారు. ఈ వ్యవహారాన్ని గ్రామస్థులు బయటపెడితే దేవాలయంలో ఉద్యోగే దీనికి కారణమంటూ ఆయనపై ఈఓ వేధింపులు ఆరంభించారు.
అర్హత లేకపోయినా శ్రీశైలం ఈఓగా :వైఎస్సార్సీపీ సర్కార్‌లో సహాయ కమిషనర్ (ఏసీ) కేడర్‌లో ఉంటూ కర్నూలు ఉప కమిషనర్ (డీసీ)గా చంద్రశేఖరరెడ్డి హవా నడిపారు. అప్పట్లో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలొచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయణ్ని శ్రీశైలం ఆలయానికి ఏఈఓగా బదిలీ చేశారు. గత నెలలో శ్రీశైలం ఈఓ పెద్దిరాజు డిప్యుటేషన్ పూర్తికావడంతో మాతృశాఖ (రెవెన్యూ)కు వెళ్లిపోయారు. ఆ సమయంలో డీసీ కేడర్‌లోని డిప్యూటీ ఈఓకి ఇంఛార్జ్ ఈఓ బాధ్యతలు ఇవ్వాలి.
దేవాదాయ అధికారులు మాత్రం కింది కేడర్‌లో ఉండి, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఈఓ చంద్రశేఖరరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కొత్త ఈఓ వచ్చేవరకు నాలుగైదు రోజుల సర్దుబాటుకే ఆయణ్ని నియమించామని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రెగ్యులర్ ఈఓను నియమించకుండా, ఆయన్నే కొనసాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.