Kumudavalli Library Specialties :పెళ్లన్నాక పెట్టిపోతలుంటాయిl ఆడపడుచు కట్నాలుంటాయి! కానీ ఆ ఊళ్లో వీటన్నింటితోపాటు అదనంగా మరో కట్నం ఉంటుంది. పేదలైనా, సంపన్నులైనా ఆ కట్నం కాదనరు. మనస్ఫూర్తిగా తోచినంత సమర్పించుకుంటారు!! అంతే కాదు ప్రతీ దీపావళికి ఇంటికి వంద రూపాయలు చందా ఇవ్వడం ఆ ఊరి కట్టుబాటు! అందుకే ఆ ఊరు ఓ విజ్ఞాన గనిగా మారింది. ఇంతకీ ఆ కట్నం కథేంటో? ఆ ఊరేమిటో? తెలుసుకుందామా!!
పశ్చిమ గోదావరి జిల్లా కుముదవల్లిలోని శ్రీవీరేశలింగం కవిసమాజ గ్రంథాలయమిది! బయటివాళ్ల దృష్టిలో ఇదో లైబ్రరీయే కావచ్చు ఈ ఊరికి మాత్రం ఇదో ఆలయంతో సమానం. చెప్పులతో లోపలికి అడుగుపెట్టడానికి వీల్లేదన్నది ఇక్కడి నియమం! సాధారణంగా పండుగలప్పుడు ఊళ్లో మండపాలు, పూజల కోసం చందాలు వసూలు చేస్తారు. కానీ ఈ ఊరిలో ఏడాదికొకసారి ఈ గ్రంథాలయం కోసం నిర్బంధ చందా సేకరిస్తారు. అలాగని ఎవరూ వ్యతిరేకించరు. అందరూ ఇష్టపూర్వకంగా ఇచ్చేస్తారు.
"ప్రతి దీపావళికి చందా ఉంది. గతంలో ప్రతి ఇంటికి రెండు రూపాయలతో చందా ప్రారంభమైంది. ఇప్పుడు చందా 100 రూపాయలకు చేరింది. లైబ్రరీ మాకు దేవాలయం లాంటింది. చెప్పులు వదిలి వస్తేనే వీఐపీలకైనా లైబ్రరీలోకి ప్రవేశం ఉంటుంది. ఈ విజ్ఞాన సంపదను రాబోయే తరాలకు అందించేందుకు పుస్తకాలను ఆన్‌లైన్ చేస్తున్నాం." - స్థానికులు
128 ఏళ్ల చరిత్ర ఈ గ్రంథాలయానిది. 1897లో భూపతిరాజు తిరుపతిరాజు దీనిని తొలుత ఓ చిన్నపాకలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పెంకుటింట్లోకి మార్చారు. గ్రామస్థుల చందాలతో దినదినాభివృద్ధి చెందిన లైబ్రరీ ప్రస్తుతం రెండస్థుల పక్కా భవనంలో ఎంతో మందికి జ్ఞానం పంచుతోంది. ఆంగ్లేయుల కాలంలో గవర్నర్గా పనిచేసిన రూథర్ ఫర్డ్ మొదలుకుని వావిలాల గోపాల కృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, సి. నారాయణరెడ్డి లాంటి ఎంతో మంది ప్రశంసలు అందుకుందీ విజ్ఞాన భాండాగారం.