Sabarimala Yatra Train Package :అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల భక్తులు భారీగా కేరళకు వెళ్తారు. అయ్యప్ప భక్తుల కోసం భారత్ గౌరవ్ రైళ్లను నడిపించాలని నిర్ణయించింది. ఐదురోజుల పాటు కొనసాగే యాత్రను అయ్యప్ప భక్తుల కోసం ఐఆర్సీటీసీతో కలిసి దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. శబరిమల యాత్ర పేరుతో రైల్వే నూతన పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. ఇంతకీ ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి..? ప్యాకేజీ ధర ఎంత ఉంటుంది..? తదితర వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తున్న భారత్ గౌరవ్ రైళ్లకు అనూహ్య స్పందన వస్తుంది. ప్రతీ సీజన్లో భక్తుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక టూరిజం ప్యాకేజీలతో భారత్ గౌరవ్ రైళ్లను నడిపిస్తుంది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బోర్డింగ్, డీ.బోర్డింగ్ స్టేషన్లతో తెలంగాణ రాష్ట్రం నుంచి దక్షిణ మధ్య రైల్వే భారత్ గౌరవ్ టూరిస్ట్ సర్క్యూట్ రైలు యాత్రను చేపట్టింది. ఐఆర్‌సీటీసీ శబరిమల యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు బ్రోచర్‌ను ఇవాళ విడుదల చేసింది. రైల్వే ప్రయాణికులు శబరిమల ఆలయం, ఇతర అనుసంధానిత యాత్రా స్థలాలను సందర్శించే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ విజ్ఞప్తి చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఆగుతుందంటే? : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరిమల యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ రైలు శబరిమలలోని ప్రసిద్ధ అయ్యప్పస్వామి ఆలయం, చొట్టనిక్కరలోని చొట్టనిక్కర దేవీ ఆలయంను దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరులో పది ముఖ్యమైన మార్గ మధ్య స్టేషన్లలో బోర్డింగ్, డీ-బోర్డింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ యాత్ర మొత్తం ట్రిప్ 4 రాత్రులు, 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో అన్ని ప్రయాణ సౌకర్యాలు రైలు, రోడ్డు రవాణాతో సౌకర్యాలు కల్పిస్తారు.
వీటితో పాటు వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు.. ఉదయం టీ, అల్పాహారం, లంచ్, డిన్నర్ - ఆన్-బోర్డు, ఆఫ్-బోర్డ్ రెండూ అందుబాటులో ఉంటాయి. రైలులో భద్రత కోసం అన్ని కోచ్‌లలో సీ.సీ.టీ.వి కెమెరాలు ఏర్పాటు చేశారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ సౌకర్యం, ప్రయాణ భీమా సౌకర్యాలు కల్పిస్తారు. ప్రయాణంలో వివిధ సేవలు అందించేందుకు ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్లు అందుబాటులో ఉంటారు.