ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టెండరుతోపాటు నిర్వహణ బాధ్యతలు అదానీకే - స్మార్ట్‌ మీటర్ల కాంట్రాక్టుల్లో అంతా ఏకపక్షమే

Smart Meters Contract to Adani Group in Andhra Pradesh: వైసీపీ సర్కార్‌ పాలన అంతా మాయా! జగన్మాయ! పైకి మాత్రం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రజాధనాన్ని కాపాడుతున్నట్లు చెప్తారు! కానీ లోపల మాత్రం బిడ్డింగ్‌లో లాలూచీలను ప్రోత్సహిస్తారు. ఆస్మదీయ సంస్థలకు కాంట్రాక్టు దక్కేలా చేస్తారు. ప్రజలపై భారం పడినా, ఖజానాకు నష్టం జరిగినా, కేంద్రం నిర్దేశించిన ధరలను దాటేసి టెండరు ఉన్నా, అయిన వారికి లబ్ది చేకూర్చేందుకు వెనకాడరు. ఇందుకు ప్రత్యక్ష ఉదారహణే జగనన్న స్మార్ట్‌ మీటర్ టెండర్‌ స్కీమ్‌.

Smart_Meters_Contract_to_Adani_Group_in_AP
Smart_Meters_Contract_to_Adani_Group_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 9:16 AM IST

టెండరుతోపాటు నిర్వహణ బాధ్యతలు అదానీకే - స్మార్ట్‌ మీటర్ల కాంట్రాక్టుల్లో అంతా ఏకపక్షమే

Smart Meters Contract to Adani Group in Andhra Pradesh: పాలనా సంస్కరణలు జరిగితే ప్రభుత్వానికి లాభం జరగాలి. ప్రజలకు ప్రయోజనం చేకూరాలి. జగన్‌ సర్కార్‌ పాలనలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. పారదర్శకతకు పాతరేస్తూ, తన అనుకున్న వారికి లాభం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారు. జగన్‌ప్రభుత్వం అదానీ సంస్థకు రాష్ట్రంలో వేల కోట్ల విద్యుత్‌ ప్రాజెక్టులను కట్టబెట్టింది. విద్యుత్‌ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం-ఆర్డీఎస్​ఎస్​లో భాగంగా గృహాలకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది.

ఆ టెండరుతోపాటు 93 నెలల నిర్వహణ బాధ్యతలనూ అదానీ సంస్థ దక్కించుకుంది. కానీ, ఇతర రాష్ట్రాల డిస్కంలు నిర్దేశించిన ధరలతో పోలిస్తే, అదానీ సంస్థతో అధిక మొత్తానికి వైసీపీ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో రాష్ట్ర ఖజానాపై 643 కోట్ల అదనపు భారం పడింది. మన కంటే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ డిస్కం పీయూవీవీఎన్​ఎల్ పరిధిలో ఒక్కో స్మార్ట్‌ మీటరు ఏర్పాటుతోపాటు నిర్వహణ నిమిత్తం నెలకు 78 రూపాయల 58పైసల వంతున చెల్లించేలా ఓ గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకుంది. వైసీపీ సర్కార్‌ మాత్రం 95రూపాయల 99 పైసలు చెల్లించేలా అదానీ సంస్థతో అంగీకారానికి వచ్చింది.

అంటే యూపీతో పోలిస్తే ఒక్కో కనెక్షన్‌కు మనం 17రూపాయల 41పైసలు అధికంగా చెల్లిస్తున్నట్లే. ఈ ప్రకారం ఆర్డీఎస్​ఎస్ మొదటి దశలో రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 లక్షల 63వేల 537 మీటర్లపై 93 నెలల నిర్వహణ వ్యవధిలో అదనంగా చెల్లించే మొత్తం 643.52 కోట్లు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం అదానీకి చెల్లించే మొత్తం కంటే తక్కువగానే మరికొన్ని రాష్ట్రాల డిస్కంలు చెల్లిస్తున్నాయి. కానీ జగనన్న ఎలుగెత్తి చాటే రివర్స్‌ టెండరింగ్, సంప్రదింపుల తర్వాతా ఏపీలోనే ఎక్కువగా చెల్లింపులు చేస్తోంది.

వేల కోట్ల విలువైన కాంట్రాక్టులన్నీ జగన్‌ సన్నిహితులకే- స్మార్ట్​గా దోపిడీ

అన్నీ అదానీ సంస్థకే: రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు, వాటి నిర్వహణ 3వేల713 కోట్లతో పనులు చేపట్టేలా అదానీ సంస్థతో జగన్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సదరు సంస్థకు లెటర్‌ ఆఫ్‌ అవార్డు కూడా ఇచ్చింది. కాంట్రాక్టు అదానీ సంస్థకే దక్కేలా ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీలు వేసిన బిడ్‌లను సాంకేతిక కారణాలతో ప్రభుత్వం తిరస్కరించింది.

ఇతర రాష్ట్రాల్లో టెండర్లు దక్కించుకున్న సంస్థలు వేసిన బిడ్‌లు తిరస్కరణకు గురికావడం ప్రభుత్వ పెద్దలకు సన్నిహిత కంపెనీలుగా భావిస్తున్న అదానీ, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ మాత్రమే ఎల్‌1, ఎల్‌2గా నిలవడంతో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతా ప్రణాళిక ప్రకారమే అదానీకి పనులు కట్టబెట్టేలా టెండరు నిబంధనలు రూపొందించడమే ఇందుకు కారణం. పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్రాజెక్టులు, థర్మల్‌ కేంద్రాలకు విదేశీ బొగ్గు సరఫరా కాంట్రాక్టు, బొగ్గు రవాణా టెండరునూ అదానీ సంస్థే దక్కించుకుంది. విధానమేదైనా పనులు మాత్రం ఆ సంస్థకే ప్రభుత్వం కట్టబెడుతోంది.

స్మార్ట్​ మీటర్ల ఏర్పాటుతో జనం జేబుకు చిల్లు - ప్రజలపై పడనున్న 20 వేల కోట్ల భారం

రెండు కంపెనీలే పోటీలో: స్మార్ట్‌ మీటర్ల పనుల కోసం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన స్మార్ట్‌ మీటర్ల తయారీ సంస్థ జెనస్‌ పవర్, విశాఖకు చెందిన ఫ్టూయంట్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ తదితర సంస్థలు వేసిన బిడ్‌లను సాంకేతిక కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఒక డిస్కం పరిధిలో నిర్వహించిన టెండర్లలో నాలుగు కంపెనీలు పోటీ పడితే అందులో ఎల్‌1 అదానీ, ఎల్‌2 షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ నిలిచాయి. సింగిల్‌ బిడ్‌ దాఖలైతే మళ్లీ టెండర్లను పిలవాల్సి వస్తుందనే షిర్డీసాయి సంస్థ ఈ ప్రక్రియలో పాల్గొందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియలో షిర్డీసాయి సంస్థ ఎక్కడా పాల్గొనకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. సర్కారు పెద్దలకు సన్నిహితమైన సంస్థల్లో ఏ కాంట్రాక్టు ఎవరికి వెళ్లాలో ముందుగా నిర్దేశించిన ప్రకారమే వాళ్లు బిడ్‌లు కోట్‌ చేస్తారు. ఆ ప్రకారం గృహ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు, నిర్వహణ పనుల టెండర్లను అదానీ సంస్థ రాష్ట్రంలో 18.5 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు, నిర్వహణ పనుల టెండర్లను షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు ప్రభుత్వం కట్టబెట్టింది.

Skill Development Program vs Smart Meters Project: స్కిల్ డెవలప్మెంట్ దోపిడీ ఐతే.. స్మార్ట్ మీటర్లతో ప్రజాధనం దుర్వినియోగం కాదా..?

తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ పిలిచిన టెండర్లలో షిర్డీసాయి, అదానీ సంస్థలకు చెందిన బిడ్‌లు మాత్రమే సాంకేతిక అర్హత సాధించాయి. అదానీ సంస్థ 1,807.009 కోట్లకు బిడ్‌ వేసి ఎల్‌1గా నిలిచింది. రివర్స్‌ టెండరింగ్, సంప్రదింపుల అనంతరం 1,045.34 కోట్లతో పనులు చేపట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్​పీడీసీఎల్​ పరిధిలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు 2,288.25 కోట్లకు బిడ్‌ వేసి అదానీ సంస్థ ఎల్‌1గా నిలిచింది. రివర్స్‌ టెండరింగ్, సంప్రదింపుల తర్వాత 1,386.93 కోట్లతో పనులు చేపట్టేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

CPDCL పరిధిలో నిర్వహించిన టెండర్లకు నాలుగు సంస్థలు స్పందించాయి. షిర్డీసాయి, అదానీ, జెనస్‌ కంపెనీ, ఫ్లూయంట్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థలు బిడ్‌లు వేశాయి. ఫ్లూయంట్‌, జెనస్​లు దాఖలు చేసిన బిడ్లను సాంకేతిక పరిశీలనలో డిస్కంలు తిరస్కరించాయి. అదానీ సంస్థ 2,205.30 కోట్లతో బిడ్‌ వేసి ఎల్‌1గా నిలిచింది. రివర్స్‌ టెండరింగ్, సంప్రదింపుల తర్వాత 1,280.73 కోట్లతో పనులు చేపట్టేలా రాష్ట్ర సర్కారుతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

విద్యుత్‌ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం కింద ఒక్కో గృహ విద్యుత్‌ కనెక్షన్‌కు స్మార్ట్‌ మీటరు ఏర్పాటు, 93 నెలల నిర్వహణకు కేంద్రం 6 వేల రూపాయల వంతున నిర్దేశించింది. ఈ లెక్కన రాష్ట్ర డిస్కంలు ప్రతిపాదించిన 38 లక్షల 63వేల 537 గృహ, పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్లకు 2,321.12 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది. కానీ, రాష్ట్రంలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు నిర్వహించిన టెండర్లను అదానీ సంస్థ 3 వేల 713 కోట్లతో చేపట్టేలా జగన్‌ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మొత్తం కేంద్రం నిర్దేశించిన దానికంటే 1,391.88 కోట్లు అదనం అన్నమాట. ఈ మొత్తంలో కేంద్రం ఇచ్చే రాయితీ పోను.. మిగిలిన భారం రాష్ట్ర ప్రజలపైనే పడనుంది.

Electricity Reforms for Loan Incentives: అప్పుల కోసం విద్యుత్తు సంస్కరణలు.. రైతులకు సర్కార్ కరెంట్ షాక్..!

ABOUT THE AUTHOR

...view details