September Month Pension Distribution in AP: సెప్టెంబరు 1న పంపిణీ చేయాల్సిన సామాజిక పింఛన్లను, ఆ రోజు ఆదివారం కావడంతో ఒక రోజు ముందే ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. బుధవారం మంత్రివర్గ సమావేశం ముగిశాక ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులతో పలు అంశాలు చర్చించారు. రాబోయే రోజుల్లోనూ నెలలో మొదటి దినం సెలవు రోజైతే, ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేస్తారని తెలిపారు.
అదే విధంగా కొందరు తెలుగుదేశం నేతల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంతో కష్టపడి, ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తెచ్చుకున్న మంచి పేరును కొందరు బుల్డోజర్లు, ప్రొక్లెయిన్‌లతో కూల్చేస్తున్నారని ఆయన మండిపడినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని స్పష్టంచేశారు. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని, వారి జిల్లాల్లోని ఎమ్మెల్యేలనూ వారే గైడ్ చేయాలని సూచించారు.
100 రోజుల్లో పదవులన్నీ భర్తీ - 25 రోజుల్లో అందరికీ శుభవార్త: చంద్రబాబు - Chandrababu On nominated Posts
ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడతా: ప్రవర్తన సరిగాలేని, వివాదాలకు కారకులవుతున్న ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడతానని ఆయన తెలిపారు. మంత్రుల వంద రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తానన్న సీఎం, జనసేన మంత్రుల పనితీరుపై నివేదికను ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అందజేస్తానన్నారు. ఉచిత ఇసుక విధానం పైనా సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలిసింది.
ఉచిత ఇసుక విధానం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందన్న చంద్రబాబు, వర్షాల వల్ల తవ్వకాలు జరపక లభ్యత తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తవ్వకం, రవాణా ఖర్చులను నియంత్రించి, 2019 నాటి ధరలకే ప్రజలకు ఇసుక లభించేలా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. విశాఖలో స్థానికంగా ఇసుక లభ్యత లేకపోవడం, దూరప్రాంతాల నుంచి తేవాల్సి రావడంతో ధరలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు.
పోలవరం టార్గెట్ ఫిక్స్- 2027 మార్చిలోగా పూర్తి చేసేలా షెడ్యూల్ :చంద్రబాబు - Polavaram Project Construction
వివరాలు ముందుగానే లీకయ్యాయి:మంత్రివర్గ సమావేశం ఎజెండాలోని అంశాలు, ఇక్కడ నిర్ణయం తీసుకోకముందే టీవీ ఛానళ్లలో వచ్చేస్తున్నాయని, ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు, ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌లోని వివరాలు కూడా ముందుగానే లీకయ్యాయని కొందరు మంత్రులు సీఎం దృష్టికి తెచ్చారు. కీలక సమాచారం బయటకు పొక్కడంపై చర్చ జరిగింది. కొన్ని శాఖల్లో ఇంకా పాతవాసనలు పోలేదని, క్రమశిక్షణ నెలకొల్పాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్ల సమాచారం.
అస్మదీయులకు లబ్ధి చేకూర్చేందుకే గత ప్రభుత్వం సార్టెక్స్ బియ్యం సరఫరా ప్రవేశ పెట్టిందని, దాన్ని నిలిపివేయాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగింది. రేషన్‌లో సార్టెక్స్ బియ్యం సరఫరా నిలిపేస్తే నాణ్యత తగ్గిందన్న విమర్శలు వస్తాయని కొందరు అభిప్రాయపడ్డారు. దానిపై మరింత లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. రేషన్ వాహనాల వల్ల ఉపయోగం లేదని, వాటిని తొలగించాలన్న చర్చ జరిగింది. కానీ వాటిని కొనడానికి గత ప్రభుత్వం బ్యాంకు రుణాలు తీసుకుందని, దానికి సంబంధించిన సమస్యల్ని అధిగమించి, ఆ వాహనాల్ని ఇతర అవసరాలకు ఎలా వాడుకోవాలన్న అంశంపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని భావించారు.
మంత్రుల పనితీరుపై కేబినెట్ భేటీలో ప్రస్తావన- ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్న చంద్రబాబు - CM on Ministers Performance
నవంబరు 1న విజన్ డాక్యుమెంట్ విడుదల: వికసిత్ అంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్‌ను నవంబరు 1న విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అక్టోబరు 2నే విడుదల చేయాలని మొదట భావించినా, గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే దాన్ని రూపొందించాలన్న ఉద్దేశంతో వాయిదా వేశారు. మంత్రులకు ఇ-కేబినెట్‌పై సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి (పొలిటికల్) ఎస్.సురేష్ కుమార్ ప్రజంటేషన్ ఇచ్చారు.
రోజువారీ వ్యవహారాల్లో ఐటీ వినియోగంపై మంత్రులకు, కార్యదర్శులకు శిక్షణ ఇవ్వాలని మంత్రి లోకేశ్ ముఖ్యమంత్రికి సూచించారు. ప్రతి మంత్రికి ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ను ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా నియమించాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. అలాగే ప్రతి మంత్రి పరిధిలోని శాఖలన్నిటికీ కలిపి ఒక పీఆర్‌ఓను ఏర్పాటు చేస్తారు. సోషల్ మీడియా కోఆర్డినేటర్ కూడా ఉంటారు. ఆయా శాఖల ద్వారా జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే దీని ఉద్దేశంగా మంత్రులకు వివరించారు.
2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ - నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం - CM CBN Meeting with NITI AAYOG
సరదా వ్యాఖ్యలు: చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సెప్టెంబరు ఒకటో తేదీకి 30 ఏళ్లవుతోందని మంత్రి రామానాయుడు గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్గ సమావేశం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపింది. అదే సందర్భంలో సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ జన్మదినమని మంత్రి దుర్గేష్ గుర్తు చేయడంతో, మంత్రివర్గం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. చంద్రబాబు మాట్లాడుతూ జన్మదిన వేడుకలకు పవన్ కల్యాణ్ దూరంగా ఉంటారని, బహుశా ఆరోజు ఆయన తనకు కూడా అందుబాటులో ఉండరేమోనని సరదా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
ఈ నెల 30న వనమహోత్సవంలో మంత్రులంతా పాల్గొనాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతుండగానే ముఖ్యమంత్రికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నుంచి ఫోన్ వచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక నగరాల అభివృద్ధిపై కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఆమె తెలియజేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రిమండలికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు- ప్రతీ పేదకు సొంత ఇల్లు : సీఎం చంద్రబాబు - CM CHANDRABABU ATTEND GRAMA SABHA